
ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీలో నిలకడగా ప్రదర్శన చేస్తున్నప్పటికీ వెటరన్ పేసర్ షమీ (Shami) వైపు టీమ్ఇండియా సెలక్టర్లు మాత్రం దృష్టిసారించడం లేదు. వచ్చే వన్డే ప్రపంచ కప్ సన్నద్ధత కోసం ఇప్పటికే 15 మందితో కూడిన యువ బౌలర్ల జాబితాను మేనేజ్మెంట్ సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. అందులో షమీకి చోటు దక్కలేదని సమాచారం. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలోనైనా షమీకి ఛాన్స్ వస్తుందనుకుంటే వీలుపడటం లేదు. పలు సందర్భాల్లో షమీ కూడా దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేనేజ్మెంట్ ఆలోచనలు భిన్నంగా ఉన్నా.. ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని షమీకి సూచించాడు. అలాగే యువ క్రికెటర్లకూ కీలక సూచనలు ఇచ్చాడు.
‘‘క్రికెటర్‌గా ఎలా ముందుకు వెళ్లాలనేది మీ నిర్ణయం. మ్యాచులు ఆడుతూ.. అందులో రాణిస్తూ ఉంటే సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లే. నేను చూసే విధానం ఎప్పుడూ ఇలానే ఉంటుంది. మేనేజ్మెంట్ ఆలోచన భిన్నంగా ఉండొచ్చు. కానీ, మీరు ఎలా ఆలోచిస్తారనేదే ముఖ్యం. జట్టులో భాగస్వామి కావాలనుకోవడంలో తప్పు లేదు. అందుకోసం ఏం చేయాలి? షమీలా కష్టపడుతూ ఉండాలి. ఇప్పటికీ అతడు ఆడుతూనే ఉన్నాడు. జాతీయ జట్టులో (Team India) అవకాశం వచ్చినా రాకపోయినా పోరాటం మాత్రం ఆపలేదు. ఛాన్స్ రాలేదని ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు’’ అని జహీర్ (Zaheer Khan) వ్యాఖ్యానించాడు.
‘‘క్రీడల్లో ఆటగాళ్లకు (Players Injuries) గాయాలు కావడం సహజం. ప్రతి ప్లేయర్ ప్రయాణంలో అవి తప్పవు. ఇప్పుడు చాలా మంది వర్క్‌లోడ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ.. టోర్నీలు, మ్యాచులకు తగినట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఎవరైనా పేసర్ గాయం కారణంగా ఇబ్బందిపడుతుంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. గాయానికి గల కారణాలను విశ్లేషించాలి. ఏం చేస్తే మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయో ఆలోచన చేయాలి. మన చేతుల్లో ఉండే వాటిని నియంత్రించొచ్చు’’ అని జహీర్ అభిప్రాయపడ్డాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





