
భారత క్రికెట్లో రవీంద్ర జడేజాకు వారసుడు వచ్చేశాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. ఏంటి అతడి రెండో టెస్టుకే ఓ నిర్ణయానికొచ్చేస్తారా? అనే సందేహం రాకమానదు. కానీ, టాలెంట్ ఉన్న ఆటగాడిని గుర్తించడానికి మరీ ఎక్కువ సమయం అవసరంలేదు కదా.. ఆ జాబితాలో చేరే బౌలర్ కమ్ బ్యాటర్ మానవ్ సుతార్(Manav Suthar).
శ్రీలంకతో మొదటి టెస్టు (India vs Srilanka) తొలి ఇన్నింగ్స్‌లో ఫస్ట్ బంతికే వికెట్ తీసి తన ఉద్దేశం ఏంటో మానవ్ సుతార్ స్పష్టం చేశాడు. ఆ తర్వాత కూడా లంక బ్యాటర్లను కుదురుకోనీయలేదు. నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ విలువైన 24 పరుగులు (43 బంతులు) రాబట్టాడు. ఇక వార్మప్ మ్యాచ్‌లోనూ లోయర్ ఆర్డర్లో పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రవీంద్ర జడేజాలా మరో నాణ్యమైన స్పిన్ ఆల్‌రౌండర్ దొరికాడంటూ ప్రశంసలు అందుకొంటున్నాడు. ఎప్పుడో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా (Ravindra Jadeja) టెస్టులు, వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జడ్డూ వయసు 37 ఏళ్లు. మరో రెండు లేదా మూడేళ్ల వరకు మాత్రమే టెస్టులు ఆడగలడు. అతడి స్థానాన్ని భర్తీ చేయగల సమర్థత సుతార్‌లో ఉందనేది మాజీల వాదన. ఈ కుర్రాడి నైపుణ్యాలకు పదునుపెడితే మరింత రాటుదేలడం ఖాయం.
ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా స్పిన్‌ను ఆడటంలో బ్యాటర్లు ఆరితేరారు. వారిని బోల్తా కొట్టించాలంటే ప్రత్యేకమైన శైలి ఉండాలి. అలాంటి బౌలర్ సుతార్ (Suthar Bowling) అనడంలో సందేహం లేదు. ప్లైటెడ్ డెలివరీలను సంధించి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. ఆడదామా.. వద్దా అనే అనుమానం కలిగిస్తాడు. ఇలాంటిదే శ్రీలంకపై తన తొలి బంతికే వికెట్ తీసి అబ్బురపరిచాడు. చండిమాల్ డిఫెన్స్ ఆడేద్దామని అనుకొనేలోపే బంతి గ్లౌవ్స్‌ను తాకుతూ కీపర్ చేతిలో పడింది. ఆడుతోంది రెండో టెస్టు అయినాసరే.. ఓపికగా లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడే బౌలర్‌గా పేరొందాడు. బంతిని డ్రిఫ్ట్ చేయడంలోనూ నేర్పరే. ఇలాంటి బాల్స్‌ను అంచనా వేయడం బ్యాటర్లకు చాలా కష్టం. టర్న్ - డ్రిఫ్ట్ కలిగిన స్పిన్నర్ మానవ్ సుతార్. ఎడమచేతివాటం కావడం కూడా అతడికి కలిసొచ్చే అంశం.
కేవలం బౌలరే అయితే మనం ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్పెషలిస్ట్ బౌలర్ల పని కేవలం వికెట్లను తీయడమే. కానీ, ఆల్‌రౌండర్‌గా బ్యాట్‌తోనూ పరుగులు చేయాలి. ఈ విషయంలోనూ మానవ్ సుతార్ సత్తా ఉన్నోడే. 2022లో రంజీల్లోకి అడుగు పెట్టిన ఆ సీజన్లో కేవలం 6 మ్యాచుల్లోనే 39 వికెట్లు పడగొట్టాడు. పుదుచ్చేరిపై 8/33 స్పెల్‌తో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఇటు బ్యాటింగ్‌లోనూ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీ (120) చేసిన అనుభవం ఉంది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో అరంగేట్రం చేసిన సుతార్ ఫైఫర్ (6/33) నమోదు చేసి అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం ఏడు వికెట్లు తీశాడు.
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన మానవ్ సుతార్ (Manav Suthar) తండ్రి జగదీశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. జగదీశ్‌కు చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలని ఉండేదట. కానీ, కుటుంబ నేపథ్యం కారణంగా కలను నెరవేర్చుకోలేకపోయారు. 2002 ఆగస్ట్ 3న మానవ్ సుతార్ జన్మించాడు. తన ఆకాంక్షను కుమారుడి రూపంలో తీర్చుకోవాలని జగదీశ్ భావించారు. అందుకోసం చాలా కష్టాలే పడ్డారు. తాము ఉండే ప్రాంతంలో టర్ప్ పిచ్ సౌకర్యం లేదు. దీంతో బ్యాంకులో రుణం తీసుకొని మరీ ఇంటికి దగ్గరలో టర్ప్ పిచ్ ఏర్పాటు చేయించారు. 11 ఏళ్ల వయసులోనే మానవ్‌ను క్రికెట్ అకాడమీలో చేర్పించారు. తన కుమారుడు గొప్ప బ్యాటర్‌గా మారాలని అనుకున్నారు. కానీ, కోచ్ సలహాతో మానవ్ స్పిన్‌ను ఎంచుకొన్నాడు. బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్నూ చేయగలనని సుతార్ నిరూపించుకొంటున్నాడు. మున్ముందూ ఇలాగే కొనసాగితే ‘జడేజా’లా నమ్మదగిన ‘స్పిన్’ ఆల్‌రౌండర్‌గా మారడం ఖాయం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
శ్రీలంకతో తొలి టెస్టులో టీమ్ఇండియా తిరుగులేని స్థితిలో నిలిచింది.





