
వార్మప్ మ్యాచ్ విజయంతో అసలైన పరీక్షకు టీమ్ఇండియా సిద్ధమైంది. ‘స్పిన్’ ఎటాక్‌తో దెబ్బ కొట్టాలనే ఆతిథ్య జట్టు సవాల్‌కు టీమ్ఇండియా (Team India in SriLanka) ఎదురు నిలుస్తుందా? మరో ఐదు రోజుల్లోనే ప్రారంభమయ్యే తొలి టెస్టు నాటికి సరిచేసుకోవాల్సిన లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా?
‘తొలి రోజు నుంచే శ్రీలంక సవాళ్లకు సమాధానం ఇస్తాం’.. ఇవీ భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు. అందుకు తగినట్టుగానే వార్మప్ మ్యాచ్‌లో భారత్ విజయం కూడా సాధించింది. ఆఖర్లో మహ్మద్ సిరాజ్ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదేశాడు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో భిన్నమైన పరిస్థితులను సృష్టించుకొని మరీ భారత జట్టు గెలిచింది. వేలి గాయంతో ఇబ్బంది పడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎట్టకేలకు బ్యాటింగ్‌కు దిగి సత్తా చాటాడు. వచ్చే శనివారం నుంచే శ్రీలంక-భారత్ (India vs Sri lanka) జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. సొంత గడ్డపై లంక జట్టును అడ్డుకోవడం తేలికేం కాదు.
గాయం కారణంగా సాయి సుదర్శన్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ, అతడు జాతీయ జట్టుకు ఆడి చాన్నాళ్లవుతోంది. నేరుగా మూడో స్థానంలో ఆడించే అవకాశం లేదు. కానీ, తనదైన ఆటతో ‘నేనున్నానంటూ’ ముందుకొచ్చాడు దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal). వార్మప్ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్‌లో ఆడగలనని నిరూపించాడు. నిలకడ, దూకుడు, సమయోచిత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఓపెనర్ యశస్వి జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్నాటికి ఫామ్ అందుకొన్నాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 207 పరుగుల లక్ష్య ఛేదనకు దిగినప్పుడు పునాదిని బలంగా వేసింది యశస్వినే. తనదైన దూకుడుతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శ్రీలంక స్పిన్నర్లను సమర్థవంతంగానే ఎదుర్కొని భారత బ్యాటర్లు పరుగులు రాబట్టారు.
దాదాపు పది నెలల నుంచి టెస్టు మ్యాచ్ బరిలోకి దిగని రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఎలా ఆడతానేది ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో అసలైన టెస్టు తరహా హాఫ్ సెంచరీ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో అవసరానికి తగ్గట్టు దూకుడుగా ఆడాడు. అటు బౌలింగ్‌లోనూ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తనలో ఇంకా టెస్టు క్రికెట్ ఆడే సత్తా తగ్గలేదని, లోయర్ ఆర్డర్‌తో కలిసి పరుగులు చేయగలనని నిరూపించాడు. కొత్త కుర్రాళ్లు మానవ్ సుతార్, సారాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్ కూడా బ్యాటింగ్ చేయగలమని సత్తా చూపారు. కానీ, బౌలింగ్‌లోనే వీరు కాస్త మెరుగు కావాల్సిన అవసరం ఉంది. స్పిన్ పిచ్‌పై ప్రభావం చూపించలేకపోయారు. చాలా అంచనాలతో వచ్చిన సారాంశ్ జైన్ ఒక్క వికెట్టూ తీయకపోవడం గమనార్హం. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లోనే బౌలింగ్ చేశాడు. రెండు వికెట్లు తీసి భారత్‌కు బాసటగా నిలిచాడు.
వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు నలుగురు పేసర్లను బరిలోకి దించింది. ఇందులో గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) మాత్రమే నయమనిపించాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Siraj)కు ‘లంక’ పిచ్‌పై విజృంభిస్తాడనే పేరుంది. కానీ, వార్మప్ మ్యాచ్‌లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ మాత్రమే తీశాడు. మరోవైపు ప్రసిద్ధ్ పరిస్థితి కూడా అంతే. ఇక జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన పేసర్ అకిబ్ నబీ ఐదు ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చాడు. వికెట్ తీయలేదు. అయితే, తొలి టెస్టులో మాత్రం ఇద్దరు పేసర్లకు మాత్రమే తుది జట్టులో అవకాశం రానుంది. మరి ఎవరు ఉంటారనేది ఆసక్తికరమే. సిరాజ్‌తోపాటు గుర్నూర్‌కు చోటు కల్పించాల్సిన పరిస్థితి. అప్పుడు ప్రసిద్ధ్, అకిబ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.
వార్మప్ మ్యాచ్‌లో గెలిచినా ఓ విషయంలో మాత్రం భారత్‌కు కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మిగతా బ్యాటర్లతో పోలిస్తే వికెట్ కీపర్లు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమై నిరాశపరిచారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 28, జురెల్ 17 పరుగులు చేసినా.. పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. పంత్ (Rishabh Pant) తన ఆటతీరుకు భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడేందుకు ప్రయత్నించడం శుభపరిణామమే కానీ.. భారీ షాట్లు కొట్టేందుకు వెళ్లి ఔట్ కావడం అభిమానులను నిరాశగురి చేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





