
© 2026 nimisham.in

టాలీవుడ్లో సంక్రాంతి సీజన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించే పండగ కావడంతో పెద్ద హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరూ తమ సినిమాలను సంక్రాంతికే తీసుకురావాలని తహతహలాడుతుంటారు. అయితే ఈసారి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాని సినిమాలు సైతం ముందే సంక్రాంతి స్లాట్‌పై కర్చీఫ్ వేసేస్తున్నాయి.
ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీనువైట్లతో కలిసి జార్జ్ క్రిష్ చిత్రాన్ని ఈ రోజు ప్రారంభించారు. సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు. మరోవైపు రవితేజ – శ్రీవిష్ణు కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించనున్న ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లనప్పటికీ సంక్రాంతి రేసులోనే నిలపాలని దిల్ రాజు పట్టుదలతో ఉన్నారు.
ఇక సీనియర్ స్టార్ హీరోలు కూడా పండగ బరిలో గట్టిగానే పోటీపడుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం సంక్రాంతికి సిద్ధమవుతోంది. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ కూడా ఇదే బరిలో ఉంది.
దీనికి తోడు కోలీవుడ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ పోటీని మరింత హీటెక్కిస్తున్నాయి. కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాతో పాటు, ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న కొత్త సినిమా కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. మొత్తానికి సినిమా షూటింగ్‌లు పూర్తి కాకుండానే విడుదల తేదీల ప్రకటనలతో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పోరు అప్పుడే వేడెక్కింది.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








