© 2026 nimisham.in
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా తన తమ్ముడికి బర్త్ డే విషెస్ అందజేశారు. కళ్యాణ్ బాబు సంకల్ప సాధకుడని ప్రశంసించారు. తన సోదరుడిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. తమ కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తారని కొనియాడారు. తన్న అన్న పోస్టుపై పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. తండ్రి స్థానంలో నిలిచి తనకు దిశ చూపిన మొదటి హీరో మీరే అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.''చిరంజీవి అన్నయ్యా.. మీ ప్రేమకు, ఆప్యాయతకు, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన అండ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి. తండ్రి స్థానంలో నిలిచి నాకు దిశ చూపిన మీరు నా జీవితంలో మొదటి హీరో. జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల నుంచి నన్ను నడిపించిన మీ మాటలు, మీ ఆలోచనలు నాతోనే ఉన్నాయి. కుటుంబం పట్ల మీ ప్రేమను, సమాజం పట్ల మీ బాధ్యతను, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ పెరిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు ఒక దిశను ఇచ్చాయి. మీరు నా జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి. మన ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను'' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.చిరంజీవి పోస్ట్ చేస్తూ.. ''సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు'' అని అన్నారు.''ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ.. మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు'' అంటూ చిరు తన తమ్ముడిపై ప్రేమ కురిపించారు.
Senior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.