
ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీలో అజింక్య రహానే (Captain Ajinkya Rahane) ముంబయి జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ సారథి కూడా అతడే. నాలుగేళ్ల కిందట భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై నిషేధం పడకుండా అజింక్య రహానే తీసుకున్న నిర్ణయమే కాపాడింది. రహానే సమయస్ఫూర్తితో వ్యవహరించి జైస్వాల్‌ను రక్షించాడు. అప్పుడు జరిగిన ఓ ఘటనను తాజాగా రహానే వెల్లడించాడు.
దులీప్ ట్రోఫీ 2022 ఫైనల్లో సౌత్ జోన్ - వెస్ట్ జోన్ తలపడ్డాయి. అప్పుడు వెస్ట్ జోన్‌కు రహానే (Ajinkya Rahane) కెప్టెన్‌గా ఉన్నాడు. కుర్రాడు యశస్వి జైస్వాల్ సత్తా చాటుతున్న రోజులవి. అయితే, క్రమశిక్షణ తప్పడంతో నాలుగు మ్యాచుల నిషేధం విధించేందుకు అంపైర్లు సిద్ధమయ్యారు. కానీ, రహానే తీసుకున్న నిర్ణయంతో యశస్వి బయటపడ్డాడు. సౌత్ జోన్ బ్యాటర్ రవితేజను పదేపదే స్లెడ్జ్ చేస్తూ యశస్వి (Yashasvi Jaiswal) రెచ్చగొడుతూ వచ్చాడు. అది మరీ ఎక్కువై.. ఇద్దరు ప్లేయర్లూ మాటామాటా అనుకొన్నారు. దీంతో రహానే వద్దకు అంపైర్లు వచ్చి మాట్లాడారు. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు జైస్వాల్‌ను మైదానం వీడాలని సూచించాడు. అప్పటికీ జైస్వాల్ స్లెడ్జింగ్ చేస్తూనే ఉండటం గమనార్హం. చివరికి కెప్టెన్ చెప్పడంతో అయిష్టంగానే జైస్వాల్ డగౌట్‌కు వెళ్లాడు.
‘‘గేమ్‌లో స్లెడ్జింగ్ అనేది సర్వసాధారణమే. ఒక్కోసారి ఆటకు ఫన్ తీసుకొస్తుంది. కానీ, అది శ్రుతి మించకూడదు. ఇలాగే వదిలేస్తే పరిస్థితి చేజారిపోతుందని అనిపించింది. బయటకు పంపించినందుకు యశస్వి కూడా బాధపడ్డాడు. కానీ, ముందు జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. కొందరు ఆటగాళ్లు నిషేధం ఎదుర్కొన్నారు. సమయం ఎలా మారిపోతుందో అంచనా వేయలేం. అవకాశం చేజారితే అందుకోవడం చాలా కష్టం. అందుకే అలా వ్యవహరించా. కెప్టెన్‌గా సహచరుడిని ఆపాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ మ్యాచ్ రిఫరీ వెంగలిల్ నారాయణన్ నేను చేసిన పనిని ఊహించలేకపోయారు. అప్పటికే నాలుగు మ్యాచులు నిషేధం విధించేందుకు సిద్ధమైపోయారు. లెటర్‌ను కూడా సిద్ధం చేశారు. మ్యాచ్ తర్వాత ‘ఇదిగో బ్యాన్ లెటర్. కానీ, నువ్వు చేసిన దానికి ఇక్కడే చించేస్తున్నా’ అని నారాయణన్ అన్నారు. అలాగే ఆ లెటర్‌ను నా ముందే ముక్కలు చేసేశారు. చివరికి జైస్వాల్మీద నిషేధం పడలేదు. ఇప్పుడు అతడు భారత జట్టులో సూపర్ ప్లేయర్. ఒకవేళ అతడిపై నిషేధం పడి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో అంచనా వేయలేం’’ అని రహానే (Rahane) గుర్తు చేసుకున్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





