
Sathupalli: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, సత్తుపల్లిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించాయి. సత్తుపల్లిలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, “కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలి” అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో పేద కుటుంబాల కష్టాలను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. తొలుత రూ.50 వేలతో ప్రారంభించిన ఈ పథకం ఆర్థిక సహాయాన్ని అనంతరం రూ.1,00,116కు పెంచి, వేలాది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తూ ఇబ్బందులు పడుతున్నారని సండ్ర వెంకట వీరయ్య గారు ఆవేదన వ్యక్తం చేశారు. పథకానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం సకాలంలో స్పందించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని సండ్ర గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఆ హామీపై ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. పేదల సంక్షేమానికి సంబంధించిన పథకాలపై నిర్లక్ష్య వైఖరిని విడనాడి, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సకాలంలో ప్రయోజనం అందించాలని డిమాండ్ చేశారు. రైతు బీమాపై కూడా నిర్లక్ష్యం వద్దు మరోవైపు రైతులకు భరోసాగా నిలిచిన రైతు బీమా పథకం విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని సండ్ర వెంకట వీరయ్య గారు కోరారు. రైతు బీమా ప్రీమియాన్ని సకాలంలో చెల్లించి, రైతు కుటుంబాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు ప్రజల్లో లభించిన ఆదరణను చూసి వాటిని నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సండ్ర ఆరోపించారు. పేదలు, రైతులు, మహిళలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పేదల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే యథావిధిగా కొనసాగించాలని, అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా ఆర్థిక సహాయం అందించాలని సండ్ర వెంకట వీరయ్య గారు డిమాండ్ చేశారు. పేదల సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి పోరాటం చేస్తుందని సండ్ర వెంకట వీరయ్య గారు స్పష్టం చేశారు.




