
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Tummidihatti: ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి కోరింది తెలంగాణ సర్కార్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షత వహించగా.. తెలంగాణ తరపున నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాధ్ దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, మహారాష్ట్ర నుంచి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అయితే సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరిగిన తొలి విడత చర్చలు అర్థవంతంగా ముగిసాయని తెలంగాణ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత, చేవేళ్ల సుజల స్రవంత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ 148 మీటర్ల ఎత్తులో మాత్రమే బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. అయితే ఈ ఎఫ్ఆర్ఎల్ ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఒక లేఖ రాసింది. అదే సమయంలోప్రధానమంత్రి మోదీకి, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసిని తెలంగాణ ప్రభుత్వం.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు.
ఈ నేపథ్యంలో.. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో.. తెలంగాణ 152 మీటర్ల పూర్తి వరద మట్టం (FRL)తో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదనపైనే విస్త్రుతంగా చర్చ జరిగింది. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ వల్ల మహారాష్ట్రలో మునిగిపోయే ప్రాంతాలు, ప్రాణహిత నదిలో నీటి లభ్యత, ప్రాజెక్టులను, రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన రక్షణ చర్యలపై చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సంబంధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ప్రతిపాదిత 152 మీటర్ల FRL వల్ల తమ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు మునిగిపోతాయని మహారాష్ట్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణ తన సాంకేతిక వైఖరిని వివరించడంతోపాటు.. వివిధ స్థాయిలలో నిర్వహించిన ప్రభావ అధ్యయనాల వివరాలను అందించింది. 148 మీటర్ల నుండి 152 మీటర్లకు ఎత్తు పెంచడం వల్ల కలిగే అదనంగా ఏర్పడే ముంపు చాలా తక్కువగానే ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. సరైన సాంకేతిక పద్ధతులు.. నివారణ చర్యలతో దీనిని పరిష్కరించవచ్చని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే, ఈ అధ్యయనం ఫలితాలను పరిశీలించేందుకు వీలుగా.. వరదలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని.. అధ్యయన నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవాలని జల మండలి ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ తెలంగాణను కోరారు. దీంతో తదుపరి విడత చర్చలకు ముందు అవసరమైన సమాచారాన్ని అందించడానికి తెలంగాణ అంగీకరించింది. ఈలోగా, తుమ్మిదెట్టి బ్యారేజీ వల్ల మహారాష్ట్ర ప్రాజెక్టులకు గానీ లేదా నది ఎగువ, దిగువ ప్రాంతాల ప్రయోజనాలకు గానీ హాని కలగకుండా చూసేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో హామీ ఇచ్చింది.
అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు సానుకూల వైఖరినే ప్రదర్శించిందని.. దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి తొలి విడత చర్చలు మంచి బాటలు వేశాయని తెలంగాణ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ వ్యవహారంలో తదుపరి విడత కీలక చర్చలు సెప్టెంబర్ మూడో వారంలో జరగనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





