
నలుగురిలోకి వెళ్లినప్పుడు అందరితో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఎంతసేపైనా సరదాగా గడిపేస్తుంటారు కొందరు. కానీ మరికొందరు మాత్రం కాసేపయ్యాక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లిపోదామా అని ఆలోచిస్తుంటారు. బయట జరిగే వేడుకలు, కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తానూ అరగంటకు మించి ఉండలేనంటోంది నటి త్రిష.
నలుగురిలోకి వెళ్లినప్పుడు అందరితో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఎంతసేపైనా సరదాగా గడిపేస్తుంటారు కొందరు. కానీ మరికొందరు మాత్రం కాసేపయ్యాక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లిపోదామా అని ఆలోచిస్తుంటారు. బయట జరిగే వేడుకలు, కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తానూ అరగంటకు మించి ఉండలేనంటోంది నటి త్రిష. ఈమధ్య ఏ వేడుకలో పాల్గొన్నా అరగంట తర్వాత తన మనసు ఇంటి వైపు లాగుతోందని ఇటీవలే ఇన్‌స్టా స్టోరీస్‌లో సరదాగా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవడంతో పాటు సోషల్ బర్నవుట్ అనే అంశాన్ని తెర మీదకు తెచ్చింది. మరి, ఇంతకీ ఏంటీ మానసిక పరిస్థితి? తెలుసుకుందాం రండి..
సోషల్ మీడియాలో వైరలయ్యే పోస్టులు, మీమ్స్ రీ-షేర్ చేస్తూ.. వాటికి సరదాగా క్యాప్షన్లు జోడిస్తుంటారు కొందరు అందాల తారలు. ఇటీవల నటి త్రిష కూడా ఇదే చేసింది. ఈమధ్య సామాజిక మాధ్యమాల్లో వైరలైన ఓ పోస్ట్‌ను తిరిగి పోస్ట్ చేస్తూ తన అనుభవాల్ని దానికి జోడించింది. ‘నలుగురితో కలిసినప్పుడు నేను కేవలం 32 నిమిషాలు మాత్రమే సరదాగా గడపగలను. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోవాలనే ఆలోచన వస్తుంది..’ అన్న పోస్ట్‌ను పంచుకుంటూ.. ‘ఈ మధ్య ఏదైనా వేడుకలు, కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు నాదీ ఇదే పరిస్థితి..’ అనే వ్యాఖ్యను దీనికి జోడించింది. ఇది నెట్టింట్లో వైరలవడంతో తామూ నలుగురిలోకి వెళ్లినప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఇలా సామాజిక వేడుకల్లో, కార్యక్రమాల్లో పాల్గొన్న కాసేపటికి లేదంటే ఎక్కువ సమయం గడిచే కొద్దీ అక్కడ్నుంచి దూరంగా వెళ్లిపోవాలనిపించడం, ఒంటరిగా గడపాలని అనిపించడాన్ని ‘సోషల్ బర్నవుట్’ లేదా ‘Social Fatigue’గా పేర్కొంటున్నారు నిపుణులు. మనసుపై ప్రతికూల ప్రభావం చూపే ఈ పరిస్థితిని ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. అయితే కొన్ని లక్షణాలతో దీన్ని గుర్తించచ్చంటున్నారు.
⚛ సాధారణంగా నలుగురిలో ఉన్నప్పుడు ఒత్తిడి దూరమై ప్రశాంతత చేకూరుతుంది. అయితే కొంతమంది మాత్రం కాసేపు బృందంలో ఉన్నా, మాట్లాడినా అలసిపోతుంటారు.. దాంతో ఇక మా వల్ల కాదంటూ ఇంటికి వెళ్లిపోవాలని, వాళ్లందరికీ దూరంగా ఉండాలని కోరుకుంటారు.
⚛ ఈ సమయంలో ఫోన్ కాల్స్ వచ్చినా కట్ చేస్తుంటారు. సందేశాలొచ్చినా రిప్లై ఇవ్వరు. ఇలా ఒక రకమైన చిరాకును వాళ్లలో గమనించచ్చు.
⚛ నలుగురి మధ్యలో ఉన్నా ముభావంగా కూర్చుండిపోతారు.. వాళ్లతో మాట కలపడానికి ఆసక్తి చూపకపోవడం, వాళ్లు వేసిన జోక్స్‌కి నవ్వకపోవడం, ఏదో ఆలోచనలో ఉండిపోవడం.. ఇవన్నీ సోషల్ బర్నవుట్‌కు సంకేతాలే అంటున్నారు నిపుణులు.
⚛ ఏకాగ్రత లోపించి అవతలి వాళ్లు అడిగే ప్రశ్నలకు ఏవేవో పొంతన లేని సమాధానాలు చెప్పడం, తడబడడం వీళ్లలో కనిపిస్తుంది.
⚛ ఒక్కోసారి ఓపిక నశించి ఎదుటివారిపై చిరాకు పడడం, కోపంగా మాట్లాడడం.. వంటివీ కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
⚛ ఈ ‘సోషల్ బర్నవుట్’ వల్ల కొంతమందిలో తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు.. వంటి సమస్యలూ ఎదురవుతాయంటున్నారు.
అయితే ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి తిరిగి మానసిక ప్రశాంతతను పొందాలంటే కొన్ని మార్గాలున్నాయంటున్నారు నిపుణులు.
⚛ కొన్నిసార్లు ఎదుటివారు ఏమనుకుంటారోనని నచ్చకపోయినా.. అందరితో కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంటారు కొంతమంది. కానీ ఇలా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం సరికాదంటున్నారు నిపుణులు. కాబట్టి నిర్మొహమాటంగా ఆ వేడుక నుంచి బయటికొచ్చేయడం మంచిదని చెబుతున్నారు.
⚛ నలుగురిలో ఎక్కువ సమయం ఉండలేననుకున్నప్పుడు.. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు/వేడుకలకు వెళ్లినప్పుడు నిర్దేశిత సమయమంటూ పెట్టుకోండి. అంతకుమించి ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా వెనక్కి వచ్చేయండి. అలాగే ఈ విషయాన్ని ముందుగానే మీ బృంద / కుటుంబ సభ్యులకు చెప్పేయండి. ఫలితంగా మీరు బర్నవుట్ అయ్యే అవకాశం ఉండదంటున్నారు నిపుణులు.
⚛ సోషల్ బర్నవుట్‌తో అలసిన మనసు తిరిగి పునరుత్తేజితం అయ్యేవరకు గ్రూప్ చాట్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు.
⚛ మీ మనసును ఉత్తేజితం చేసే, మనసుకు నచ్చిన పనులు చేయండి. వీటిని ఒంటరిగానైనా చేయచ్చు.. లేదంటే ఇంట్లో వాళ్లతో కలిసైనా సరదాగా చేసేయచ్చు.
⚛ ధ్యానం, యోగా, సంగీతం వినడం.. వంటివి మానసిక అలసటను దూరం చేసి తిరిగి పునరుత్తేజితం చేస్తాయి.
⚛ ‘పిలిచిన ప్రతి ఈవెంట్‌కీ వెళ్లాలి.. నలుగురి దృష్టిలో పడాలి’ అనుకుంటారు కొందరు. అయితే ఇలా ఇతరుల్ని సంతృప్తిపరచాలన్న ఆతృత కూడా కొన్నిసార్లు బర్నవుట్ అయ్యేలా చేస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి ‘వాళ్లు పిలిచారు కదా.. తప్పకుండా వెళ్లాలి’ అనుకోకుండా.. మీ మనసు మాట వినాలంటున్నారు. అప్పుడే మానసికంగా అలసిపోకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.
అలాగని సమాజానికి దూరంగా ఉండడం కూడా సరికాదు. కాబట్టి సామాజిక సంబంధాల్ని కొనసాగించే విషయంలో, మీకోసం మీరు కేటాయించుకునే సమయం పరంగా కొన్ని పరిమితులు పెట్టుకోవడం వల్ల ఇటు మీరు బర్నవుట్కి గురికాకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే నలుగురితో సత్సంబంధాల్నీ కొనసాగించచ్చంటున్నారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.