
భారత్- రష్యా మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కీలక భేటీ నిర్వహించారు. ఇరు దేశాధినేతలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సమస్యలు, సవాళ్లపై చర్చించారు. అలాగే ఉక్రెయిన్- రష్యా మధ్య నిరంతరాయంగా కొనసాగుతున్న యుద్ధానికి ఇక ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ప్రతిరోజూ యుద్ధం కారణంగా మానవత్వం నశిస్తుందని.. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్ కేక్ లో నిర్వహించిన షాంగై కో ఆపరేషన్ సదస్సు(SCO) లో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యారు. శాంతి స్థాపన కోసం భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ మేరకు తన సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు.
" ప్రతిరోజూ యుద్ధం కారణంగా మానవత్వం వెనక్కు వెళ్తుంది. శాంతి స్థాపన కోసం ముందుకు వేసే ఒక్కో అడుగు మానవత్వాన్ని పెంపొందిస్తుంది. కొత్త ఆశలను చిగురింపజేస్తుంది" అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మనమంతా ముగింపు లేని యుద్ధం నుంచి ముగింపు పలికే యుద్ధం దిశగా చేరుకోవాలని అన్నారు. మానవత్వం సంరక్షణకు ఇదే ముందడుగు.. వీలైనంత త్వరలో అన్ని సమస్యలు కొలిక్కి వస్తాయి" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శాంతి సందేశం విషయంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత్ నుంచి ప్రపంచ దేశాలకు ఇచ్చే సందేశం ఇదేనని ప్రధాని మోదీ.. పుతిన్ తో జరిగిన భేటీలో స్పష్టం చేశారు.
ఈ మేరకు ఇరు దేశాధినేతలు ఉక్రెయిన్ తో యుద్ధంపై చర్చలు నిర్వహించారు. గతంలోనూ పుతిన్ తో జరిగిన భేటీల్లో ఉక్రెయిన్ అంశాన్ని ఆయన ప్రధానంగా లేవనెత్తుతున్న సంగతి తెలిసిందే. " ఎక్సెలెన్సీ.. ఉక్రెయిన్ గురించి మేము ఎప్పుడూ చర్చిస్తుంటాం. శాంతి స్థాపనకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. భవిష్యత్తులోనూ సహకారం అందిస్తుంది అని ప్రధాని మోదీ తెలిపారు. మరోవైపు భారత్ లో నిర్వహించే బ్రిక్స్ సమావేశంపైనా ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో శాంతి స్థాపనకు సంబంధించిన సమస్యలు, అంతర్జాతీయ ఒప్పందాలపై చర్చించే అవకాశం లభిస్తుందని అన్నారు. మరికొద్ది రోజుల్లో బ్రిక్స్ సమావేశాన్ని భారత్ నిర్వహిస్తుందని తెలిపారు. పుతిన్ ఈ సమావేశానికి హాజరైతే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ భేటీపై పుతిన్ మాట్లాడుతూ.. భారత్- రష్యా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ట్రేడ్, టూరిజం, ఎడ్యూకేషన్, మల్టీ లేటరల్ కోపరేషన్ తదితర విభాగాల్లో ఇరు దేశాల మధ్య వృద్ధికి కృషి చేస్తామన్నారు. రష్యాలో అత్యధిక సంఖ్యలో భారత విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. అలాగే ఇరు దేశాల మధ్య టూరిజం కూడా గణనీయంగా పెరుగుతోందని అన్నారు. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ- పుతిన్ ల భేటీ అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.





