
టీమ్ ఇండియాకు టెస్టుల్లో ఫస్ట్ డౌన్ బ్యాటర్ సెంచరీ కొట్టి రెండున్నరేళ్లు అయింది. ఈ మాట చాలు ఆ ప్లేస్ కోసం మన జట్టు ఎంతగా ఇబ్బంది పడుతోందో తెలియడానికి. ఈ సమస్యకు ఎట్టకేలకు చెక్ పడింది. సెంచరీతో ఆ పని చేసింది దేవదత్ పడిక్కల్. కేరళ టు తెలంగాణ టు కర్ణాటక ట్రావెల్ చేసిన ఈ కుర్రాడి గురించి చూద్దాం.
ఎక్కడ విఫలమయ్యాడో, ఎక్కడ విమర్శలు ఎదుర్కొన్నాడో.. అక్కడే సెంచరీ కొడితే ఎలా ఉంటుంది? ఈ ఫీలింగ్ గురించి మీకు తెలియాలి అంటే ఓసారి దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) మనసులోని మాట తెలియాల్సిందే. రెండేళ్ల క్రితం భారత టెస్టు జట్టులోకి వచ్చి ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా ఆడిన పడిక్కల్ ఆశించిన ప్రదర్శన అయితే ఇవ్వలేకపోయాడు. వరుసగా 65, 0, 25 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో మళ్లీ జట్టులోకి రావడానికి సుమారు రెండున్నరేళ్లు పట్టింది. సాయి సుదర్శన్ గాయపడటంతో పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. రావడంతోనే సెంచరీ (131* - ప్రస్తుతానికి)తో శ్రీలంకపై విరుచుకుపడ్డాడు. నిజానికి అతని బ్యాటు సత్తా ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే లంకేయులకు తెలిసింది. ఇటీవల జరిగిన ఆ మ్యాచ్‌లోనూ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
కేరళలోని మలప్పురం జిల్లా ఎడప్పాల్‌లో పుట్టిన దేవదత్ పడిక్కల్ తల్లిదండ్రులు బాబును కున్నత్, అంబిలి పడిక్కల్. కేరళలో జులై 7,2000లో పుట్టాడు. బిజినెస్ మ్యాన్ అయిన బాబును కున్నత్, దేవదత్ పడిక్కల్ చిన్నతనంలోనే హైదరాబాద్ వచ్చేశారు. ఇక్కడ కొన్నాళ్లు ఉన్నాక.. కొడుకులోని క్రికెట్ ఆసక్తిని గమనించి శిక్షణ ఇప్పించాలనుకున్నారు. దేవదత్‌కి 10 ఏళ్ల వయసు వచ్చేసరికి మరింత శిక్షణ అవసరం అనిపించింది. దాంతో కర్ణాటక షిఫ్ట్ అయిపోయారు. అక్కడే దేవదత్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. ఇప్పటికే అదే రాష్ట్రానికి ఆడుతున్నాడు. ఆఖరికి ఐపీఎల్లో కూడానూ.
శ్రీలంక బౌలర్లను ఈ రోజు డామినేట్ చేసిన పడిక్కల్.. స్కూల్ క్రికెట్లోనూ ఇదే పని చేశాడు. ఆర్మీ పబ్లిక్ స్కూల్ తరఫున ఆడుతూ.. కర్ణాటక స్కూల్ క్రికెట్లో ఛాంపియన్ అనే పేరున్న సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ హైస్కూల్ జట్టును ఒంటి చేత్తో ఓడించాడు. అప్పుడు కన్నడ నాట దేవదత్ పేరు మారుమోగింది. అన్నట్లు తొలి రోజుల్లో దేవదత్ రైట్ హ్యాండరే. కానీ బ్యాటింగ్ దగ్గరకు వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండర్ అయిపోయాడు.
పడిక్కల్ దేశవాళీ క్రికెట్లోకి 2018లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే 2019 - 20 సీజన్ చాలా ప్రత్యేకం. ఆ సంవత్సరం విజయ్ హజారే ట్రోఫీ (609 పరుగులు), సయ్యద్ ముస్తాక్ అలీ (580 పరుగులు) ట్రోఫీల్లో అదరగొట్టి దేశవాళీలో కర్ణాటక జట్టు ఆధిపత్యం కొనసాగించడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్లో 2020లో 473 పరుగులు చేసి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఇంత ప్రదర్శన తర్వాత భారత జట్టులోకి పిలుపు వచ్చింది. 2021లో ఇదే శ్రీలంకపై టీ20లో అరంగేట్రం చేయగా.. 2024లో ఇంగ్లాండ్‌పై తొలి టెస్టు ఆడాడు.
శ్రీలంకపై టీ20ల్లో తొలి మ్యాచ్ ఆడినప్పుడు పడిక్కల్ ఓ రికార్డు కూడా సాధించాడు. భారత జట్టులో స్థానం సంపాదించిన తొలి జెన్ ఆల్ఫా (2000 తర్వాత పుట్టిన) క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఇప్పుడు భారత జట్టుకు ఫస్ట్ డౌన్లో 19 మ్యాచ్‌ల తర్వాత సెంచరీ చేసిన ఘనత సాధించాడు. ఆఖరిగా ఈ ప్లేస్‌లో శుభ్‌మన్ గిల్ (110) శతకం సాధించాడు. ఇది 2024 మార్చిలో జరిగింది. ఈ లెక్కన మన జట్టు ఫస్ట్ డౌన్ కష్టం తీరినట్లే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





