
వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఈనాడు, అమరావతి
ఆహారాన్ని మెల్లగా, బాగా నమిలి తినడం ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, చాలామంది భోజనం చేస్తున్నప్పుడు, తిన్న వెంటనే నీరు తాగకూడదనే నియమాన్ని పాటిస్తుంటారు. భోజనం తర్వాత వెంటనే నీరు తాగితే జీర్ణరసాలు పలుచబడి ఆహారం జీర్ణం కాదని.. కడుపులోనే కుళ్లిపోతుందనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే, దీనివల్ల గ్యాస్ట్రిక్, అల్సర్లు వంటి సమస్యలు తలెత్తుతాయనేది ఓ నమ్మకం. మరి, ఇందులో నిజమెంత? ఈ వాదనలపై ఆధునిక వైద్యశాస్త్రం ఏం చెబుతోందో గుంటూరు జీజీహెచ్ జీర్ణకోశవ్యాధి నిపుణులు డాక్టర్ నాగూర్బాషా మాటల్లో తెలుసుకుందాం..!
సాధారణంగా సంప్రదాయ నమ్మకాలకు, గ్యాస్ట్రో ఎంటరాలజీ చెబుతున్న వాస్తవాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. భోజనంతో పాటు.. తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవు.
అపోహ: నీరు తాగితే పొట్టలో ఉత్పత్తయ్యే ఆమ్లాలు, ఎంజైమ్లు పలుచబడి జీర్ణక్రియ దెబ్బతింటుంది.
వాస్తవం: జీర్ణాశయం చాలా తెలివైన అవయవం. తీసుకునే ఆహారం, నీటి పరిమాణం ఆధారంగా ఆమ్ల స్థాయులను స్వయంగా నియంత్రించుకుంటుంది. నీరు తాగినంత మాత్రాన హైడ్రోక్లోరిక్ ఆమ్లం పలుచగా మారి జీర్ణక్రియ ఆగిపోయే పరిస్థితి రాదు.
అపోహ: ఆహారం నీటిలో తేలిపోయి, జీర్ణం కాకుండా కుళ్లిపోతుంది.
వాస్తవం: జీర్ణక్రియ.. ఒక నిరంతర యాంత్రిక రసాయన ప్రక్రియ. జీర్ణాశయంలో ఉండే బలమైన ఆమ్లాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. కాబట్టి ఆహారం ఎప్పుడూ కుళ్లిపోదు.
అపోహ: తినేటప్పుడు నీరు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు వస్తాయి.
వాస్తవం: నీరు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు రావు. హెలికో బాక్టర్ పైలోరీ (హెచ్.పైలోరీ) అనే బ్యాక్టీరియా, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం, ఒత్తిడి, ఆహారం తినేటప్పుడు గాలిని మింగడం, కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా ఈ సమస్యలు రావొచ్చు.
భోజన సమయంలో లేదా తిన్న తర్వాత తగిన మోతాదులో నీరు తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
ఆహారం విచ్ఛిన్నం: తిన్న ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లిన తర్వాత ముద్దగా మారడానికి నీరు సహాయపడుతుంది. దీనివల్ల ఎంజైమ్లు సులభంగా పని చేసి ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.
పోషకాల శోషణ: జీర్ణక్రియ అనంతరం పోషకాలను పేగులు సులభంగా గ్రహించి రక్తంలో కలుపుతాయి. దీనికి నీరు అత్యవసరం.
మలబద్ధకం నివారణ: భోజనంతో పాటు నీరు తీసుకోవడం వల్ల మలం మృదువుగా మారి, మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది.
‘‘ఆరోగ్యవంతులు భోజనంతో పాటు నీరు తాగడం సురక్షితమే. గ్యాస్ట్రో ఈసోఫిజియల్ రిఫ్లక్స్ డిసీజ్(జీఈఆర్డీ), తీవ్రమైన ఎసిడిటీ సమస్యలున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనంతో పాటు ఒకేసారి గ్లాసులకొద్దీ నీరు తాగొద్దు. ఇలా చేస్తే జీర్ణాశయం నిండిపోయి జఠర రసాలు ఆహారనాళంలోకి వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు భోజనానికి అరగంట ముందు లేదా భోజనం తర్వాత కొద్దికొద్దిగా నీరు తాగడం మంచిది’’ అని డాక్టర్ నాగూర్ బాషా సూచిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.