
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Rajinikanth:సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ధర్మన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఓరి దేవుడా, డ్రాగన్ చిత్రాల దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
ధర్మన్ లో రామ్ పోతినేని రజనీకాంత్‌కు అల్లుడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, సినిమాలో ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. హీరోగా వరుస సినిమాలు చేస్తున్న రామ్.. తొలిసారి ఇలాంటి విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇది కేవలం అతిథి పాత్ర కాదని, కథను కీలక మలుపు తిప్పే స్థాయిలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
సినిమాలో రజనీకాంత్ కుమార్తె పాత్రలో రాశీ ఖన్నా నటిస్తున్నట్లు సమాచారం. ఆమె ప్రేమించిన యువకుడిగా, అనంతరం ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తిగా రామ్ పోతినేని కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో రజనీకాంత్, రామ్ మధ్య మామా అల్లుళ్లుగా సాగే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే ఘర్షణలు భారీ యాక్షన్ ఎపిసోడ్లకు దారితీస్తాయని ప్రచారం జరుగుతోంది.
ఈ పాత్ర కోసం ముందుగా ధృవ్ విక్రమ్‌ను సంప్రదించినట్లు కూడా సమాచారం. అయితే ఆయన ఈ ఆఫర్‌ను అంగీకరించకపోవడంతో రామ్ పోతినేనిని సంప్రదించినట్లు తెలుస్తోంది. కథ, పాత్ర నచ్చడంతో రామ్ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు టాక్.
కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం మరో షెడ్యూల్ కొనసాగుతుండగా, అందులో రామ్ పోతినేని కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. మరోవైపు రామ్ హీరోగా నటించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సమయంలో రజనీకాంత్ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్రను ఎంచుకోవడం ఆయన కెరీర్లో ఆసక్తికరమైన ప్రయోగంగా మారే అవకాశం ఉంది. ‘ధర్మన్’లో రజనీకాంత్, రామ్ పోతినేని మధ్య మామా అల్లుళ్ల పోరు ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




