
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ (Irumudi) ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయ్యప్ప స్వామి మాల నేపథ్యంతో ఫ్యామిలీ, క్రైమ్ అంశాలను మేళవించిన ఈ చిత్రంపై దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) ఎంతో నమ్మకంగా ఉన్నారు. సినిమా విడుదలకు ముందు ఆయన మీడియాతో మాట్లాడి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘ఇరుముడి’లో రామ్ చరణ్ (Ram Charan) కనిపిస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై శివ నిర్వాణ స్పందించారు. “రామ్ చరణ్ గారు సినిమాలో కనిపించరు. అది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఆయన అయ్యప్ప భక్తుడు కావడంతో, ఆ వైబ్ ఉంటుంది. బహుశా అభిమానులు అలా కోరుకుని ఉంటారు. కానీ ఈ సినిమాలో చరణ్ గారు కనిపిస్తారన్న వార్తల్లో నిజం లేదు. ఈ సినిమా ఆయనకు నచ్చాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.
‘ఇరుముడి’ని మలయాళ చిత్రం ‘మాలికాపురం’తో పోల్చడంపై కూడా దర్శకుడు స్పందించారు. సినిమాలో అయ్యప్ప స్వామి మాల నేపథ్యం, ఫ్యామిలీ, క్రైమ్ అనే మూడు ప్రధాన లేయర్లు ఉంటాయని తెలిపారు.
“అయ్యప్ప స్వామి మాల నేపథ్యంలో, ఫ్యామిలీ, క్రైమ్ అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ఇలాంటి కథను రవితేజ లాంటి స్టార్ హీరోతో చేస్తే దాని రీచ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా సౌత్‌లో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. అందుకే పోలికలు రావడం సహజం. ‘మాలికాపురం’తో కూడా పోల్చారు. అయితే నా సినిమా కంటెంట్ ఏంటో నాకు తెలుసు. ఇది చాలా యూనిక్ ఫిల్మ్. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటివరకు సినిమా రాలేదు” అని అన్నారు.
“ఇరుముడి’ కథ రాసుకున్నప్పుడు రవితేజను దృష్టిలో పెట్టుకోలేదని శివ నిర్వాణ తెలిపారు. అయితే కథ చెప్పిన తర్వాత ఈ పాత్రకు రవితేజ పర్ఫెక్ట్గా సరిపోతారని భావించినట్లు చెప్పారు.
“ఆయన గడ్డం, తేజస్సు ఈ పాత్రకు అద్భుతంగా సరిపోయాయి. రవితేజ గారు చాలా కూల్‌గా ఉంటారు. కథ చెప్పి ఓకే చేసిన తర్వాత దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. ఎవరిపైనా ఒత్తిడి పెట్టరు” అని చెప్పారు.
‘ఇరుముడి’లోని ‘మల్లెపూల పల్లకి’ పాటకు అద్భుతమైన స్పందన వస్తోందని శివ నిర్వాణ తెలిపారు. అయ్యప్ప స్వామి మాల నేపథ్యంలో కథ సాగుతుంది కాబట్టి సినిమాలో భజనలు, పాటలు ఉంటాయని తెలిపారు. సీలేరు ప్రాంతంలోని అయ్యప్ప భక్తులు ఎక్కువగా పాడుకునే పాట ఏదని ఓ స్వామిని అడిగినప్పుడు ‘మల్లెపూల పల్లకి’ గురించి చెప్పారని, అదే పాటను సినిమాలో ఉపయోగించినట్లు వెల్లడించారు.
ఈ పాటను ఒరిజినల్‌గా పాడిన డప్పు శ్రీనుతోనే మళ్లీ పాడించడానికి కారణాన్ని కూడా దర్శకుడు వివరించారు.
“ఈ పాటను గత 15 ఏళ్లుగా అయ్యప్ప భక్తులు పడిపూజల్లో పాడుతున్నారు. అందుకే వారి మనోభావాలను గౌరవిస్తూ ఒరిజినల్‌గా పాట పాడిన డప్పు శ్రీను గారితోనే మళ్లీ పాడించాం. ఆయన ఇప్పుడు 60 ఏళ్ల వయసులో ఉన్నారు. అయినా ఈ పాట ఆయన గొంతుతోనే చిరస్థాయిగా నిలిచిపోవాలని మేమంతా కోరుకున్నాం. థియేటర్లలో ఈ పాటకు మంచి పూనకం వస్తుంది” అని చెప్పారు.
‘మనెమ్మ’ పాత్ర కోసం సహజమైన, పల్లెటూరి నేటివిటీ ఉన్న అమ్మాయి కావాల్సి వచ్చిందని శివ నిర్వాణ తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నక్షత్ర రీల్స్ చూసిన తర్వాత ఆమెను లుక్ టెస్ట్ చేసి ఎంపిక చేసినట్లు చెప్పారు.
సినిమా కథలోని మూడు ప్రధాన ముడులను కలిపేలా ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఎంచుకున్నట్లు శివ నిర్వాణ చెప్పారు.
“తండ్రికి, కూతురికి ఒక ముడి ఉంటుంది. అలాగే అయ్యప్ప భక్తుడికి, మాలకు మరో ముడి ఉంటుంది. దీనికి తోడు క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఈ మూడు ముడులను కలిపి ‘ఇరుముడి’ అనే టైటిల్ పెట్టాం” అని వివరించారు.
‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘ఖుషి’ వంటి ప్రేమకథలకు భిన్నంగా ‘ఇరుముడి’ కథను ఎంచుకోవడానికి కారణం తన కథలు ప్రేక్షకుల మనసుల్లో ఎక్కువ కాలం నిలిచిపోవాలన్నదేనని శివ నిర్వాణ తెలిపారు.
“ప్రతి కథను తీవ్రంగా చెప్పాలనేది నా ఉద్దేశం. నేను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా నా సినిమాలు, నా కథలు గుర్తుండిపోవాలి. అలాంటి ఇంటెన్సిటీ ప్రేమకథల్లో కొంతవరకు దొరుకుతుంది. ‘ఇరుముడి’లో కూడా క్రైమ్ యాంగిల్లో ఒక అద్భుతమైన కథ నాకు దొరికింది” అని చెప్పారు.





