
చీరల వ్యాపారిని మోసగించిన నిందితుడి అరెస్టు బాధితునికి 100% సొమ్ము రీఫండ్
బాధితుడికి రూ.కోటి చెక్కు అందజేస్తున్న సైబరాబాద్ సీపీ రమేశ్, సైబర్ క్రైమ్ డీసీపీ పుష్ప. చిత్రంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ మన్మోహన్ తదితరులు
ఈనాడు, హైదరాబాద్ రాయదుర్గం, న్యూస్‌టుడే: సైబర్ నేరగాళ్ల బారిన పడి పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయిన బాధితుడు వెంటనే సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 100% సొమ్ము తిరిగి వచ్చిన ఉదంతమిది. ఈ కేసులో అంతర్రాష్ట్ర నిందితుడు దీపక్‌కుమార్(37)ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బుధవారం సైబర్‌క్రైమ్ డీసీపీ పుష్ప, ఏసీపీ రవీందర్‌రెడ్డిలతో కలిసి సీపీ రమేశ్ వివరాలు తెలిపారు. హైదరాబాద్ నిజాంపేట్‌లోని ఓ రిటైల్ చీరల దుకాణంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఈ నెల 4న యజమాని డీపీతో వాట్సప్ కాల్ వచ్చింది. వెంటనే రూ.కోటి నగదును తాను సూచించిన బ్యాంకు ఖాతాలో జమచేయాలని అవతలి వ్యక్తి ఆదేశించారు.
వ్యాపార లావాదేవీల్లో భాగమని భావించిన ఆయన... నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలో చెప్పినంత సొమ్ము జమచేశారు. నగదు బదిలీ జరగ్గానే అసలు యజమాని ఫోన్‌కు బ్యాంకు నుంచి మెసేజ్ రావటంతో ఆయన అప్రమత్తమయ్యారు. అకౌంటెంట్‌కు ఫోన్ చేసి నగదు గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సైబర్ మోసంగా భావించిన బాధితుడు 1930 నంబర్, సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ రవీందర్‌రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ మన్మోహన్ బృందం దర్యాప్తు చేపట్టింది. నగదు జమయిన బ్యాంకు ఖాతాను స్తంభింపజేసి, అక్కడ లభించిన సమాచారం ఆధారంగా ఆరా తీస్తే మాయగాళ్ల బండారం వెలుగులోకి వచ్చింది.
‘యూపీలోని లఖ్‌నవూకు చెందిన దీపక్‌కుమార్(37) వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అంజు, ఆకాశ్ సులభంగా డబ్బు సంపాదించేందుకు సైబర్ మోసాలను ఎంచుకున్నారు. కొట్టేసిన నగదు జమ చేసేందుకు కరెంట్ ఖాతా అవసరం కావడంతో దీపక్‌కుమార్‌తో చేతులు కలిపారు. ముగ్గురూ కలిసి రూ.600 కోట్ల టర్నోవర్‌తో వెల్నెస్ కేంద్రాలు నిర్వహిస్తున్నట్టు నకిలీపత్రాలు సృష్టించారు. లఖ్‌నవూలోని ఇండస్ బ్యాంకులో కరెంట్ ఖాతా ప్రారంభించారు. ఎంపిక చేసిన వ్యక్తుల ఫోన్‌కు లింక్‌లను పంపి.. ఏపీకే ఫైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయడం ద్వారా సొమ్ము కొల్లగొడతారు. కాజేసిన సొమ్ములో 30% దీపక్‌కుమార్‌కు ఇచ్చి..మిగిలిన 70% నిందితులు ఇద్దరూ పంచుకునేవారు.
ఇదే తరహాలో నిజాంపేట్‌కు చెందిన రిటైల్ చీరల దుకాణంలో పనిచేసే అకౌంటెంట్‌ను బురిడీ కొట్టించారు’ అని సీపీ రమేశ్ వెల్లడించారు. ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా ఆధారంగా అసలు సూత్రదారి దీపక్‌కుమార్‌గా నిర్ధారించి ఈ నెల 8న అరెస్టు చేసినట్లు చెప్పారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. బ్యాంకు సహకారం, న్యాయస్థానం ఆదేశాలతో కేవలం 10 రోజుల వ్యవధిలో బాధితుడు నష్టపోయిన రూ.కోటి నగదును రీఫండ్ చేశామని సీపీ తెలిపారు. దేశంలోనే తొలిసారి సైబర్ నేరాల్లో 100% రికవరీ చేసినట్టు స్పష్టంచేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





