
Awarapan 2 Review || చిత్రం: ఆవారాపన్ 2; నటీనటులు: ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ, షబానా అజ్మీ, సువీందర్ విక్కీ, విజయంత్ కోహ్లీ తదితరులు; నిర్మాత: విశేష్ భట్; రచన: బిలాల్ సిద్ధిఖీ; దర్శకత్వం: నితిన్ కక్కర్
2007లో విడుదలైన క్లాసిక్ యాక్షన్ డ్రామా ‘ఆవారపన్’. (Awarapan) బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, టెలివిజన్, ఇతర ఛానళ్ల ద్వారా సినిమా చూసి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దాదాపు 19ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ జంటగా ‘ఆవారాపన్2’ వచ్చింది. ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది?
Awarapan 2 story || అలియా హమిద్ (శ్రియ) మరణం శివమ్ పండిట్‌ను (ఇమ్రాన్ హష్మి) బాధపెడుతూనే ఉంటుంది. పుట్టినరోజు సందర్భంగా నివాళి అర్పించేందుకు ఆమె సమాధి దగ్గరకు వెళ్లగా, అక్కడ పసికందు కనిపిస్తుంది. ఆ పాపకు అలియా అని పేరు పెట్టి అనాథాశ్రమంలో చేరుస్తాడు. ఆ పాపకు కావాల్సిన అన్ని అవసరాలు దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. పాపకు దాదాపు పదేళ్ల వయసు వచ్చిన తర్వాత ఓ జంట దత్తత తీసుకుంటుంది. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు ఆ జంటను హత్య చేసి, పాపను ఎత్తుకెళ్లిపోతారు. అలియాతో పాటు, మరి కొంతమంది పిల్లలను కూడా కిడ్నాప్ చేసి బ్యాంకాక్ తరలిస్తారు. ఆ గ్యాంగ్‌ను అధికారికంగా పట్టుకోలేమని అందుకు సాయం చేయమని శివమ్‌ను కోరతాడు ఇంటర్‌పోల్ ఆఫీసర్ సమ్రత్ (అతుల్ కుమార్). మరి బ్యాంకాక్ వెళ్లిన శివమ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? ఆ ముఠా నుంచి అలియా సహా చిన్నారులను శివమ్ విడిపించడానికి ఎలాంటి ప్లాన్ వేశాడు? ఈ క్రమంలో పరిచయమైన జారా (దిశా పటానీ) ఎవరు?మానవ అక్రమ రవాణా చేస్తున్న సికిందర్ (అనిరుధ్ రావల్)కు జారాకు ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
Awarapan 2 review Telugu || ఒక మూవీకి సీక్వెల్ వస్తుందంటే, దానిపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగుంటాయి. ‘ఆవారాపన్’ వంటి సినిమా అనేకసరికి ఆ అంచనాలు ఇంకాస్త పెరిగాయి. సినిమా అంతా చూసిన తర్వాత అర్థమయ్యే విషయం ఏంటంటే.. అసలు సీక్వెలే అవసరం లేని ఒక కథకు, కాల్పనికత జోడించి, మళ్లీ దాన్నొక రొటీన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దడం అవసరమా? అనిపిస్తుంది. దీన్నొక సెపరేట్ కథగా తీసినా కథాంశంలో ఉన్న ఆత్మ ఏమీ దెబ్బతినదు. తనకు బాగా దగ్గరైన ఒక చిన్నారిని కాపాడేందుకు కథానాయకుడు ఎంత దూరం వెళ్లాడన్నది ఈ చిత్ర కథ. ‘వరుణ్ డాక్టర్’ సహా చాలా సినిమాల్లో ఇదే ఇతివృత్తం కనిపిస్తుంది. కాకపోతే, దీనికి నేపథ్యం బ్యాంకాక్ తీసుకోవడం, స్క్రీన్‌ప్లేను రేసీగా నడపటం, యాక్షన్ సీక్వెన్స్ కారణంగా పెద్దగా విసిగించకుండా సాగిపోతుంది.
వెంకటేశ్ @ 40 ఇయర్స్.. యాక్టింగ్ రాదు అన్నారు.. కానీ..
ప్రాణప్రదంగా ప్రేమించిన అలియాను కోల్పోయి దేవదాస్‌లా మారిన శివమ్‌ను చూపిస్తూ కథ మొదలు పెట్టిన దర్శకుడు ఎక్కువసేపు ఈ వ్యవహారాన్ని సాగదీయకుండా అలియా కిడ్నాప్‌తో మలుపు తిప్పాడు. (Awarapan 2 review) శివమ్ బ్యాంకాక్ వెళ్లిన తర్వాత కథ, కథనాల్లో అసలు సంఘర్షణ మొదలవుతుంది. సికిందర్ గ్రూపులో శివమ్ చేరేందుకు చోటు చేసుకునే నాటకీయ పరిణామాలు, ఈ క్రమంలో వచ్చే ఛేజింగ్ సీక్వెన్స్ యాక్షన్ ప్రియులను మెప్పిస్తుంది. ఆ తర్వాత చిన్నారులను దాచిన కంటెయినర్ గురించి శివమ్ ఆరా తీయడం, వాళ్ల గ్యాంగ్‌లో ఓ నమ్మకద్రోహి ఉన్నాడంటూ వాళ్లలో వాళ్లు కొట్టుకు చచ్చేలా వేసే ప్లాన్ చాలా గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో చూసినవే. ప్రథమార్ధం దాదాపు ఇదే ఫార్మాట్లో సాగుతుంది.
శివమ్ బ్యాంకాక్ ఎందుకు వచ్చాడో జారాకు తెలిసిన తర్వాత కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రణయం, ఆ నేపథ్యంగా వచ్చే పాటలు కాస్త సాగదీత వ్యవహారంలా అనిపిస్తాయి. ప్రీ-క్లైమాక్స్ ముందుకు వరకూ ఇది కొనసాగుతుంది. ఇంటర్‌పోల్ సాయంతోనే శివమ్ బ్యాంకాక్‌లో అడుగు పెట్టాడన్న విషయం సికందర్‌కు తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సన్నివేశాలే. ఈ క్రమంలో నడిచే ఎమోషనల్ డ్రామా కథ ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది తప్ప, పెద్దగా ప్రభావం చూపించదు. ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమాను ముగించి సినీ ప్రియులను మెప్పిస్తుంది.
శివమ్ పండిట్ పాత్రలో ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi) నటన సెటిల్డ్‌గా ఉంది. ఎక్కడా కూడా అతి కనిపించదు. తన నటన, యాక్షన్‌తో పాత్రకు కావాల్సిన హీరోయిజం తెరపై చూపించే ప్రయత్నం చేశారు. దిశా పటానీ (Disha Patani) అందంగా ఉంది. ఆమె పాత్ర జస్ట్ ఓకే. ఇక ఇందులో సికందర్‌గా ప్రతినాయకుడి పాత్రలో అనిరుధ్ రావల్ నటించారు. సీనియర్ నటుడు పరేశ్ రావల్ తనయుడికి ఇది మంచి డెబ్యూ. తనదైన నటన, హావభావాలు, డైలాగ్ డెలివరీతో అనిరుధ్ మెప్పించాడు. షబానా అజ్మీ ఓ కీలక పాత్రలో మెరిశారు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు చేసుకుంటూ వెళ్లిపోయారు. సాంకేతికంగా సినిమా బాగుంది. నేపథ్య సంగీతం చాలా సన్నివేశాలకు ప్రాణం పోసింది. యాక్షన్ కొరియోగ్రఫీ, నిడివి ఈ సినిమాకు బలం. బిలాల్ సిద్ధిఖీ రాసిన కథకు నితిన్ కక్కర్ చాలా వరకూ న్యాయం చేశారు. సినిమాను ఎక్కువ సాగదీయకుండా షార్ప్‌గా ప్రజెంట్ చేసిన విధానం మెప్పిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





