
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
BC Women Free Sewing Machine: తెలంగాణలోని మహిళలకు 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని.. ఇది నిరంతరం కొనసాగే పథకం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. వంద శాతం సబ్సిడీపై ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేలు ఉందని.. వాటిని ఉచితంగా మహిళలకు ఇస్తామని తెలిపారు. బీసీ మహిళల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యం అని పేర్కొన్నారు. బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం తీసుకువచ్చినట్లు వివరించారు.
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గురువారం లాంఛనంగా పథకాన్ని ప్రారంభించిన అనంతరం పొన్నం ప్రభాకర్ కీలక ప్రసంగం చేశారు. బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించి వారిని కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12,000 కాగా లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వంద శాతం సబ్సిడీపై అందిస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలకు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల మేరకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
కుట్టు మిషన్ల కోసం మహిళల నుంచి అధిక డిమాండ్ ఉంటుందని.. మొదటి దశలో 1.19 లక్షల మంది అర్హులకు ప్రయోజనం కల్పిస్తామని మంత్రి ప్రభాకర్ తెలిపారు. భవిష్యత్‌లో పథకాన్ని మరింత విస్తరించి ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయిస్తూ, వాటి నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఇటీవల బలహీన వర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి బీసీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. కులగణన అనంతరం బీసీల అభివృద్ధికి సంబంధించిన తదుపరి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.





