ఒక ప్రాంత చరిత్రను చదవడం సులభం. కానీ ఒక ప్రాంతం ఎలా మారుతోందో అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే చరిత్ర గతాన్ని నమోదు చేస్తుంది. అభివృద్ధి మాత్రం గతం, వర్తమానం, భవిష్యత్తును ఒకే సూత్రంలో ముడిపెడుతుంది. అందుకే ఒక ప్రాంతాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాని కంటే, ఇప్పుడు ఎక్కడ నిలిచింది, రేపు ఎటు వెళ్లే అవకాశముంది అన్నదే మరింత ముఖ్యమైన ప్రశ్న. రాయలసీమను కూడా ఈ దృక్కోణంలోనే చూడాల్సిన అవసరం ఉంది.రాయలసీమ గురించి దశాబ్దాలుగా ఒక స్థిరమైన అభిప్రాయం సమాజంలో ఏర్పడింది. కరవు, వర్షాభావం, నీటి కోసం పోరాటం, వలసలు, వెనుకబడిన వ్యవసాయం, ఫ్యాక్షన్ హింస, పరిమిత పెట్టుబడులు— ఇవే రాయలసీమను నిర్వచించే పదాలుగా మారాయి. ఈ అభిప్రాయాలు కల్పితం కావు. అవి ఒక చారిత్రక వాస్తవానికి ప్రతిబింబం. ప్రకృతి పరిమితులు, సాగునీటి కొరత, భౌగోళిక పరిస్థితులు ఈ ప్రాంత అభివృద్ధిని చాలాకాలం నిరోధించాయి.అయితే ఏ ప్రాంత చరిత్ర కూడా ఒకే అధ్యాయంతో ముగియదు. గతాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని వర్తమానాన్ని అంచనా వేయడం ఎంత తప్పో, వర్తమానాన్ని మాత్రమే చూసి భవిష్యత్తును నిర్ణయించడం కూడా అంతే ప్రమాదకరం. అందుకే రాయలసీమను నేడు మళ్లీ చదవాల్సిన అవసరం వచ్చింది. గత కొన్నేళ్లలో ఈ ప్రాంతంలో కనిపిస్తున్న మార్పులు గణాంకాల్లో మాత్రమే కాదు, జీవన విధానంలోనూ ప్రతిబింబిస్తున్నాయి. సాగునీటి విస్తరణతో వ్యవసాయ స్వరూపం మారుతోంది. ఉద్యానవన పంటలు రైతు ఆదాయానికి కొత్త దిశ చూపుతున్నాయి. ఖనిజ సంపద పారిశ్రామిక అవకాశాలుగా రూపాంతరం చెందుతోంది. సౌర, పవన విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ వంటి రంగాలు రాయలసీమను దేశ గ్రీన్ ఎనర్జీ పటంలో ప్రముఖ స్థానానికి తీసుకెళ్తున్నాయి. ఒకప్పుడు ప్రకృతి పరిమితులుగా కనిపించిన ఎండ, గాలి నేడు ఆర్థిక వనరులుగా మారుతున్నాయి.కానీ ఈ మార్పును కేవలం పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కోణంలో మాత్రమే అర్థం చేసుకుంటే చిత్రం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. రాయలసీమ మరో ప్రత్యేకత దాని మానవ మూలధనం. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ ఏర్పడిన సేవా ఆర్థిక వ్యవస్థ, పుట్టపర్తి నుంచి ప్రపంచానికి వెళ్లిన మానవతా సందేశం, విన్సెంట్ ఫెర్రర్ ప్రారంభించిన గ్రామీణ అభివృద్ధి నమూనా, విశ్వవిద్యాలయాలు, జాతీయ విద్యాసంస్థలు, వైద్య సేవలు— ఇవి ఈ ప్రాంత సామాజిక బలాన్ని నిర్మించాయి. ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి ఒకదానికొకటి బలమయ్యే అరుదైన ఉదాహరణగా రాయలసీమ నిలుస్తోంది. అభివృద్ధిని కొలిచే ప్రమాణాలు కూడా కాలానుగుణంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఆనకట్టలు, కర్మాగారాలు, రహదారులే అభివృద్ధి సూచికలు. నేడు వాటితో పాటు విద్య, ఆరోగ్యం, ఉపాధి, మానవ సామర్థ్యం, సామాజిక భాగస్వామ్యం, పర్యావరణ సమతుల్యత కూడా సమాన ప్రాధాన్యం పొందుతున్నాయి. ఈ కొత్త ప్రమాణాలతో చూస్తే రాయలసీమను కొత్త కోణంలో పరిశీలించాల్సిన అవసరం స్పష్టమవుతుంది.అందుకే ఈ ప్రత్యేక అధ్యయనాన్ని అభివృద్ధి పరంపరను విశ్లేషిస్తూ... పరస్పర అనుసంధానమైన కథనాలుగా రూపొందించాం. ఇవి రాయలసీమ సహజ, ఆర్థిక రూపాంతరాన్ని విశ్లేషిస్తాయి. నీరు నుంచి ఉద్యానవనం వరకు, ఖనిజ సంపద నుంచి పరిశ్రమల వరకు, గ్రీన్ ఎనర్జీ నుంచి ప్రజల జీవన మార్పుల వరకు సాగిన ప్రయాణాన్ని ఈ కథనాలు పరిచయం చేస్తాయి. మానవాభివృద్ధి కథను చెబుతాయి. తిరుపతి, పుట్టపర్తి, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, విద్యా కేంద్రాలు, వైద్య సేవలు, సామాజిక సంస్థలు కలిసి ఈ ప్రాంతాన్ని ఎలా బలోపేతం చేశాయో విశ్లేషిస్తాయి. ఈ కథనాల కలబోత ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తాయి. రాయలసీమ రూపాంతరం ఒకే ప్రాజెక్టు వల్లా, ఒకే విధానం వల్లా, ఒకే సంస్థ వల్లా సంభవించిన మార్పు కాదు. ప్రకృతి వనరులు, ప్రజల శ్రమ, సేవా భావం, ఆధ్యాత్మిక సంస్థలు, ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు పారిశ్రామిక చొరవ... ఇవన్నీ కలిసి నెమ్మదిగా నిర్మించిన అభివృద్ధి ప్రక్రియ.ఈ కథనాలు విజయాలను కీర్తించడానికి కాదు... వైఫల్యాలను వెతకడానికి కూడా కాదు... వాస్తవాలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం. ఎందుకంటే రాయలసీమ ఇంకా పూర్తి కాలేని అధ్యాయం. ఇంకా సవాళ్లు ఉన్నాయి. అదే సమయంలో అసాధారణ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.ఒకప్పుడు కరవుకు ప్రతీకగా నిలిచిన ఈ నేల, రేపు స్థిరమైన అభివృద్ధి నమూనాకు ప్రతీకగా నిలుస్తుందా? సహజ సంపద, మానవ సంపద కలయిక రాయలసీమ భవిష్యత్తును ఎలా మలుస్తుంది? ఈ అంశాల విశ్లేషణల కలబోతే మనం ముందుముందు చూడబోయే కథనాలు.Read Also: రాయలసీమ డెవలప్మెంట్ ఆడిట్ పార్ట్-1Read Also: ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ఆడిట్ కథనాలుRead Also: దక్షిణ కోస్తా డెవలప్మెంట్ ఆడిట్ కథనాలుగమనిక:‘సమయం’ పాఠకుల కోసం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆడిట్ పేరిట సరికొత్త సిరీస్ను ప్రారంభించాం. మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ చెన్ను పెద్దిరాజు సొంత అధ్యయనంతో, విశ్లేషణాత్మక కోణంలో అందించే ప్రత్యేక సిరీస్ ఇది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సమకాలీన అంశాలపై విభిన్న కోణాల్లో సాగే ఆయన వ్యక్తిగత విశ్లేషణలు, ఆలోచనలను యథాతథంగా పాఠకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ సిరీస్కు రూపకల్పన చేశాం. ఆయన లోతైన అవగాహన, విశ్లేషణల సమాహారంగా సాగే ఈ కథనాలను పాఠకులకు సరికొత్త దృక్పథాన్ని అందిస్తాయని ఆశిస్తున్నాం. ఈ కథనాల్లోని అభిప్రాయాలు జర్నలిస్ట్ వ్యక్తిగతమైనవి, ‘సమయం’కు సంబంధం లేదని గమనించగలరు.





