
ఇంటర్నెట్‌ డెస్క్: జిందాల్‌ స్టీల్‌ లిమిటెడ్‌ కంపెనీ (Jindal Steel) గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది. ప్రపంచంలోనే పొడవైన స్టీల్‌ స్లాగ్‌ రహదారిని నిర్మించి ఈ రికార్డును దక్కించుకొంది (Guinness World Record). ఈ మేరకు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. స్టీల్‌ తయారీ ప్రక్రియలో వెలువడే చెత్తను స్టీల్‌ స్లాగ్‌గా పిలుస్తారు.
సెంట్రల్‌ రోడ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CSIR-CRRI)తో జిందాల్ స్టీల్‌ కంపెనీ జట్టుకట్టి.. దాదాపు 2 లక్షల టన్నుల ప్రాసెస్‌ చేసిన స్టీల్‌ స్లాగ్‌తో 1.85 కిలోమీటర్ల పొడవైన రోడ్డును నిర్మించింది. సాధారణ రోడ్లతో పోలిస్తే.. స్టీల్‌ స్లాగ్‌ రహదారులు ఎక్కువ కాలం మన్నుతాయని శాస్త్రీయగా తేలింది. 30-40 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది. నిర్వహణ వ్యయాలు కూడా తక్కువే. శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక రంగాల కలయికతో దేశ నిర్మాణానికి అవసరమైన విలువైన వనరులను తయారు చేయొచ్చని ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, జిందాల్‌ స్టీల్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ నవీన్‌ జిందాల్‌ తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి వ్యర్థాల నుంచి సంపద సృష్టించొచ్చని అన్నారు. స్టీల్‌ స్లాగ్‌ను రోడ్డు నిర్మాణంలో విలువైన వనరుగా అభివర్ణించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





