
ఒకప్పటితో పోలిస్తే మహిళలు వివిధ రంగాల్లో పురోగతి సాధిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి కీలక నిర్ణయాలను చాలామంది సొంతంగానే తీసుకుంటున్నారు. ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధిస్తున్నారు.
ఒకప్పటితో పోలిస్తే మహిళలు వివిధ రంగాల్లో పురోగతి సాధిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి కీలక నిర్ణయాలను చాలామంది సొంతంగానే తీసుకుంటున్నారు. ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధిస్తున్నారు. కానీ అదే సమయంలో ఇంటి బాధ్యతల విషయంలో మాత్రం మహిళల పాత్ర మారడం లేదు. ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి వస్తే.. ఇక్కడ మరో షిఫ్ట్‌లో ఉద్యోగం మొదలవుతుంటుంది. డిన్నర్‌కి ఏం చేయాలి? పిల్లలు హోంవర్క్ చేశారా? సరుకులు ఏం కొనాలి?.. వంటి పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. వీటి ఫలితంగా ఆధునిక మహిళ సాధికారత సాధించినా పనిభారంతో తీవ్రంగా అలసిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలుగా మనం అలసిపోకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘టైమ్ యూజ్ సర్వే’ ఫలితాల ప్రకారం మహిళలు సగటున రోజుకి 4.81 గంటల సమయాన్ని ఇంటి పనులకు కేటాయిస్తున్నారట. అదే సమయంలో మగవారు మాత్రం కేవలం 1.46 గంటలే అందుకు వెచ్చిస్తున్నారట. కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకోవడానికి స్త్రీలు 2.28 గంటల సమయం కేటాయిస్తే.. పురుషులు మాత్రం 1.25 గంటల సమయాన్ని మాత్రమే వెచ్చిస్తున్నారట. ఈ సమయమంతా ఆఫీసు పనిగంటలకు అదనంగా ఉండడంతో వారు మానసికంగా, శారీరకంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ఫలితంగా ఉద్యోగం చేసినంత మాత్రాన మహిళలకు పూర్తి స్వేచ్ఛ లభించడం లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కొన్నేళ్ల పాటు మహిళలను కేవలం ఇంటి పనులకే పరిమితం చేసేవారు. కాలక్రమేణా అమ్మాయిలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. తద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నారు. అయితే చాలా కుటుంబాల్లో గతం తాలూకు సంప్రదాయాలు మాత్రం కనుమరుగవలేదు. ఉద్యోగమనేది కుటుంబ బాధ్యతలకు అదనమైందే తప్ప పూర్తి స్వేచ్ఛ మాత్రం లభించడం లేదు. ఈ క్రమంలో ఆధునిక మహిళ తీవ్రంగా అలసిపోతోంది. దీన్నుంచి బయటపడాలంటే పలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు.
కుటుంబ బాధ్యతల్లో దంపతులిద్దరికీ సమాన వాటా ఉంటుంది. అంతేకానీ, ఇంటి బాధ్యతలను కేవలం మహిళ మీదే పెట్టేయడం సరికాదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో దంపతులిద్దరూ ఇంటి పనుల్ని సమంగా పంచుకోవాలంటున్నారు. అంటే.. పిల్లల స్కూల్ బాధ్యతలు ఒకరు తీసుకుంటే.. మరొకరు ఇంట్లో పెద్దలకు సంబంధించిన డాక్టర్ అపాయింట్మెంట్స్, పరీక్షలు చేయించడం, మందులు కొనడం.. మొదలైన పనుల్ని చూసుకోవాలి. అలాగే గ్రాసరీ బాధ్యతలను ఒకరు తీసుకుంటే.. ఇంటికి సంబంధించి వివిధ బిల్లులు చెల్లించడం వంటి వాటిని మరొకరు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒక్కరి పైనే అధిక భారం పడదంటున్నారు.
ఒత్తిడి, అలసట నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తమ కోసం సమయం కేటాయించుకోవాల్సిందే. అయితే ఇది వినడానికి బాగున్నా.. చాలామంది అమలు చేయలేకపోతుంటారు. అందుకే దీనికోసం పక్కా ప్రణాళిక వేసుకోవడమే కాదు.. దానిని తు.చ. తప్పకుండా పాటించాలంటున్నారు. ఈ క్రమంలో ప్రతి రెండు రోజులకోసారి ఇంటి పనులకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఆ సమయంలో వాటిని భాగస్వామి చేసేలా ఇద్దరూ కలిసి ఒక అవగాహనకు రావాలంటున్నారు నిపుణులు.
మహిళలుగా మనం ఇంట్లో చేసే పనికి ఎలాంటి గుర్తింపు ఉండదు. అందుకే ఇంట్లో చేసే ప్రతి పనిని కాగితంపై రాయాలంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం.. వంటి పనుల గురించి మాత్రమే కాకుండా షాపింగ్ లిస్టులు, బిల్ పేమెంట్స్‌తో పాటు ఇంట్లో చేసే ప్రతి చిన్న పనిని చేర్చాలంటున్నారు. ఆ తర్వాతే భాగస్వామితో చర్చించి పని విభజన చేసుకోవాలని చెబుతున్నారు. ఇందుకు అవసరమైతే సంబంధిత యాప్స్ సహాయం కూడా తీసుకోవచ్చు.
పిల్లల బాగోగులు కూడా తల్లిదండ్రులిద్దరూ సమంగానే చూడాలి. కానీ, ఈ భారం కూడా తల్లి పైనే ఎక్కువగా పడుతుంది. ఉదాహరణకు పిల్లలు ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆ బాధ్యతను తల్లే తీసుకుంటుంది. కానీ, దానికి బదులుగా ఇద్దరిలో ఎవరు తమ పనిని సర్దుబాటు చేసుకోగలరో ఆలోచించాలి. అప్పుడే మహిళలు తమ కెరీర్‌ను కూడా బ్యాలన్స్ చేసుకోగలుగుతారు. అలాగే పిల్లలు పెద్దయ్యే కొద్దీ వారిని సైతం ఇంటి పనుల్లో భాగం చేయాలి. దానివల్ల వారికి కుటుంబ బాధ్యతలపై అవగాహన కలుగుతుంది. వివిధ నైపుణ్యాలు కూడా పెరుగుతాయంటున్నారు నిపుణులు. పరోక్షంగా మహిళలపై ఒత్తిడి తగ్గుతుందంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.



