
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Hyderabad: 'మేం అధికారంలోకి వచ్చిన తరవాత విద్య, వైద్యాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నాం. పేదల ఆరోగ్యాన్ని బాధ్యతగా భావిస్తున్నాం. పేదలు కార్పొరేట్ ఆసుపత్రిలో ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. ఆఖరికి కిడ్నీలు కూడా అమ్ముకుంటున్నారు' అని తెలంగాణ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. '32 నెలలు పరిపాలనలో రూ.2,222 కోట్లు ఆరోగ్య శాఖకు ఖర్చు పెట్టాం. రూ.5,626 కోట్లు కేవలం వైద్యం కోసమే ఖర్చు చేశాం. రూ.21,800 కోట్లు ఈ శాఖలు ఖర్చు చేశాం. జాగ్రత్తగా రూపాయి రూపాయి కూడబెట్టి వైద్యానికి ఖర్చు పెడుతున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి కూలిపోవడానికి సిద్ధంగా ఉంటే పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లకి వేరే దగ్గర ఆసుపత్రి నిర్మించాలనే ఆలోచన రాలేదు అని విమర్శించారు.
హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్‌కి టెంకాయ కొట్టి నిధులు కేటాయించలేదు. ప్రతి ఆరు నెలలకోసారి ఆసుపత్రిని ప్రారంభిస్తాం. కార్పొరేట్ దీటుగా పరిశుభ్రంగా ఆసుపత్రిని నిర్వహణ చేస్తాం' అని తెలంగాణ సీఎం తెలిపారు. వైద్యులను అదనపు సమయం చేయమని చెప్పాలని.. వారికి ప్రోత్సాహకాలు ఇద్దామని అధికారులకు చెప్పారు. తమకు కష్టం ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఉందని. ఆదుకోవడానికి తామున్నామనే నమ్మకం కలిగించాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి ఆదేశించారు.
'సనత్‌నగర్ ఎమ్మెల్యే (తలసాని శ్రీనివాస్ యాదవ్) కేటీఆర్‌ని తీసుకొచ్చి ఈ ఆసుపత్రిని మేమే కట్టాం అని చూపించారు. ఇక కేటీఆర్ టిమ్స్ నేనే కట్టిన అన్నారు. ఇక హైదరాబాద్ కట్టినది నేనే అన్నది. మీ నాయన ఫామ్‌హౌస్‌లు, మీ చెల్లులు, మీ బావ ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. మరి మా పేదలకు ఒక్క ఆసుపత్రి కట్టలేకపోయారు' అని విమర్శించారు. కరువు రావాలని అఘోర్ పూజలు చేయడం మానేసి నల్లమల పోయి పూజా చేస్తే మీ దోచుకున్న రూ.లక్ష కోట్లలో నియోజకవర్గానికో రూ.పది కోట్ల ఖర్చు పెడితే కొంత పాపం తగ్గుతుంది' అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
అంతకుముందు ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. కార్డియో, రీనల్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సైన్సెస్ విభాగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్‌ఆపరేటివ్ వార్డు, ట్రామా విభాగం, ఐసీయూ వంటి విభాగాలను మంత్రులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
చికిత్స కోసం వచ్చే వారి నమోదు, రిసెప్షన్లో టోకెన్ డిస్పెన్సర్ యంత్రం పని తీరు, ఓపీ కౌంటర్ పనితీరును ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆయా విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి.. అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించి వాటి పనితీరు అడిగి తెలుసుకున్నారు. నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా మంచి వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.




