
రూ.లక్షలు పోసి వాహనం కొంటాం. ఆ తర్వాత షోరూం వాళ్లు సూచించారని కొన్ని, యాక్సెసరీస్ షాపుల వాళ్లు తప్పనిసరి అన్నారని మరికొన్ని ఉపకరణాలు వాహనానికి బిగించుకుంటారు. రూ.లక్షలు పెట్టాం.. ఈ చిన్నవి అమర్చుకుంటే ఏంటి అన్న ఆలోచనో, వాహనం కూడా గ్రాండ్‌గా కనిపిస్తుందనో అవన్నీ పెట్టేసుకుంటారు. తీరా బండి రోడ్డెక్కాక తెలుస్తుంది. ఒక్కో నిబంధన. ఎప్పుడైనా అత్యవసర పని మీద ఊరెళ్తుంటే పోలీసులు ఆపి ‘అదెందుకు పెట్టావ్.. ఇదెందుకు బిగించావ్’ అని అడుగుతుంటే.. ఏమీ పాలుపోని స్థితి తలెత్తుతుంది. కొన్ని సార్లు ప్రమాదం జరిగే వరకూ తెలియదు. అందుకే వాహన ఉపకరణాలు, వాటి ప్రభావాలపై ముందే అవగాహన పెంచుకోవాలని ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్నారు.
బండి బాహుబలిలా కనిపించాలని కొందరు, ట్రాఫిక్‌లో వాహనాలు తగిలి కారుకు డెంట్లు పడతాయేమోనని చాలా మంది ముందు, వెనుక స్టీల్ బంపర్ రాడ్లు అమర్చుకుంటారు. మోటారు వెహికిల్ చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం ఇవి నిషేధం.
కారుతో సహా వచ్చేవి ఉంటే ఏమీ కాదు. ఎందుకంటే అవి కారు పొడవు, ఎత్తు తదితర ప్రమాణాల ఆధారంగా ఏర్పాటు చేస్తారు.
సమస్య: అదనంగా బిగించుకునే ఫుట్‌రెస్టులు, క్రాష్గార్డులు వాహన బరువును అసమతౌల్యం చేస్తాయి.
వాహన డోర్ల అద్దాలకు నల్ల ఫిలిం వాడొద్దన్నందుకు ఏకంగా సన్షేడ్లు, మాగ్నటిక్ కర్టెన్లు ఉపయోగిస్తున్నారు. ఇవికూడా చట్టవిరుద్ధమే.
సమస్య: కారు డోర్లకు పెట్టే ఈ తెరల వల్ల మలుపులను గుర్తించలేం.
బయటి పరిసరాలు కనిపించకుండా వాడే నల్లటి తెరల వల్ల లైన్ మార్చేటప్పుడు, మలుపు తీసుకునేటప్పుడు, సైడ్ మిర్రర్ సరి చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది.
నంబరు ప్లేట్లలో ఏకరీతి కోసం ప్రభుత్వం హైసెక్యూరిటీ ప్లేట్లు తీసుకొచ్చింది. అవి ఉంటే పోలీసులకు వాహనాన్ని సులువుగా గుర్తిస్తారు.
సమస్య: నంబర్లు పేట్లను వంచడం, కావాల్సిన నంబరును పెద్దగా చేయడం వల్ల ఆపద సమయంలో కారును సులువుగా గుర్తించలేరు. నంబరు ప్లేటుపై పేర్లు, గుర్తులు, ఇతర ఎలాంటి అలంకరణలు ఉన్నా చట్ట విరుద్ధమే.
వాహనం ముందు అద్దం మూలల్లో పీయూసీ, టోల్ వంటి స్టిక్కర్లు రేర్‌వ్యూ మిర్రర్‌కు సరిగ్గా వెనుక అతికించుకోవచ్చు. అంతకు మించి డ్రైవర్ దృష్టి మరల్చే మరేవీ అతికించొద్దు.
సమస్య: వెనుక, ముందు ఏ అద్దంపైనైనా రేడియంతో ఎలాంటివి అతికించకూడదు. అద్దాలు 70శాతం కాంతి ప్రసరింపజేసేలా ఉండాలి.
ఎలాంటి అదనపు ఉపకరణాలు బిగించుకున్నా.. అవి వాహన అసలు ఫ్రేంను, దాని వేగాన్ని ప్రభావితం చేయొద్దు. డోర్ తీయగానే కాలుపెట్టుకునేలా కొన్ని వాహనాలకు ఫుట్‌రెస్టులు బిగిస్తారు. అవి పక్కన వెళ్లే వాహనాలకు తగిలేలా ఉంటాయి. ఇలా ఉపకరణాల వల్ల చాలా వరకు బీమా వర్తించదు. ఈ విషయం వాహనంలో ఉపకరణాలు బిగించే సంస్థలేవీ చెప్పవు. యాక్ససరీస్ అంటే వాహనానికి, అందులో కూర్చున్నవారికి, ఇతర వాహనదారులకూ సౌకర్యంగా ఉండాలే తప్ప ఇబ్బంది కాకూడదని గుర్తించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




