ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీ దే హవా కొనసాగుతోంది. ట్రెండ్ దగ్గరి నుంచి రాజకీయాలు, ప్రభుత్వాలను గద్దె దించేవరకు.. జెన్‌జీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో జెన్‌జీ ఏం చేసినా అది వార్తగానే మారుతోంది. ఈ నేపథ్యంలోనే యువత ఎక్కడ నివసించాలనుకుంటోంది.. ఉద్యోగం, కెరీర్‌తో పాటు ఎంజాయ్మెంట్, కొత్త అనుభవాలు, మంచి ఫుడ్, నైట్‌లైఫ్, కల్చర్.. ఇవన్నీ ఒకే నగరంలో దొరికితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం Gen Zలో ఇదే అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా యువతకు అత్యంత ఇష్టమైన నగరాలపై నిర్వహించిన తాజా సర్వే ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది.ప్రతి ఏడాది ప్రపంచంలోని ప్రముఖ నగరాలపై ర్యాంకింగ్స్ విడుదల చేసే Time Out.. ఈసారి 30 ఏళ్లలోపు వేలాది మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది. వారు నివసిస్తున్న నగరాల్లో జీవితం ఎలా ఉంది.. అక్కడ ఖర్చులు, ఎంటర్టైన్మెంట్, సంస్కృతి, సామాజిక జీవనం ఎలా ఉన్నాయి.. ఆ నగరాలు యువతకు ఎంతవరకు నచ్చుతున్నాయి.. అనే అంశాలపై వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ సర్వేలో గతేడాది నంబర్ వన్‌గా నిలిచిన బ్యాంకాక్‌ను వెనక్కి నెట్టి టోక్యో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.టోక్యో, జపాన్జపాన్ రాజధాని టోక్యో ఈసారి Gen Z ఫేవరెట్ సిటీగా నిలిచింది. పురాతన సంప్రదాయాలకు ఆధునిక లైఫ్‌స్టైల్‌ను జోడించిన ఈ టోక్యో నగరం యువతకు అనేక రకాల అనుభవాలను అందిస్తోంది. కలర్‌ఫుల్ షాపింగ్ ప్రాంతాలు, రద్దీగా ఉండే వీధులు, ఆలయాలు, పార్కులతో పాటు ఫ్యాషన్, మ్యూజిక్, యానిమే, గేమింగ్ వంటి యువతను ఆకట్టుకునే క్రియేటివ్ కల్చర్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. కొత్తదనం కోసం వెతికే వారికి టోక్యోలో ప్రతి అడుగులోనూ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది.పోర్టో, పోర్చుగల్జెన్జీ ఫేవరెట్ సిటీల్లో రెండో స్థానంలో పోర్చుగల్‌లోని పోర్టో నిలిచింది. వేగంగా పరుగులు పెట్టే మెట్రో నగర జీవితానికి భిన్నంగా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. చారిత్రక కట్టడాలు, నదీ తీరాలు, పార్కులు, కేఫ్‌లు, ఆర్ట్ మ్యూజియంలు, స్థానిక మార్కెట్లు యువతను ఆకర్షిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకునే అవకాశం ఉండటం ఈ నగరానికి మరో ప్లస్ పాయింట్.మెల్బోర్న్, ఆస్ట్రేలియాక్రియేటివ్ కల్చర్, విభిన్న కమ్యూనిటీలు, సోషల్ లైఫ్‌కు మెల్బోర్న్ ఫేమస్. కేఫ్‌లు, స్ట్రీట్ ఆర్ట్, మ్యూజిక్ వేదికలు, రెస్టారెంట్లు మెల్బోర్న్ నగరాన్ని యువతకు ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కాఫీ కల్చర్‌కు మెల్బోర్న్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రీడాభిమానులకు క్రికెట్‌తో పాటు ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ వంటి గేమ్స్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తాయి.ఎడిన్బర్గ్, యునైటెడ్ కింగ్డమ్చరిత్ర, ఆధునిక సంస్కృతికి చక్కని కలయిక స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్. పురాతన వీధులు, కోటలు, ప్రకృతి అందాలతో పాటు భారీగా స్టూడెంట్స్ జనాభా ఉండటం వల్ల ఎడిన్బర్గ్ నగరంలో యువత సందడి ఎక్కువగా ఉంటుంది. నైట్‌లైఫ్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాత Edinburgh Festival Fringe వంటి భారీ కార్యక్రమాలు ఈ ఎడిన్బర్గ్ నగరానికి ప్రత్యేక ఆకర్షణ.షాంఘై, చైనావేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక నగరాల్లో చైనాలోని షాంఘై ఒకటి. ఎత్తైన భవనాలు, భారీ షాపింగ్ ప్రాంతాలు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు Gen Zని ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు ఆధునిక స్కైలైన్ కనిపిస్తే.. మరోవైపు పాత ప్రాంతాలు నగరానికి భిన్నమైన రూపాన్ని చూపిస్తాయి. స్ట్రీట్ ఫుడ్ నుంచి ఖరీదైన రెస్టారెంట్ల వరకు ఫుడ్ లవర్స్‌కు ఎన్నో ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.ఈ నగరాలు మాత్రమే కాకుండా న్యూయార్క్, కోపెన్హాగన్, బెర్లిన్, వాలెన్సియా, బ్యాంకాక్, నేపుల్స్, కేప్‌టౌన్, క్రాకోవ్, సియోల్, పారిస్, ఏథెన్స్, మెక్సికో సిటీ, రియో డి జనీరో, వాంకోవర్, వియన్నా నగరాలు కూడా Gen Zకు నచ్చిన నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మొత్తానికి.. ఈ ర్యాంకింగ్స్ చూస్తే Gen Zకు కేవలం ఉద్యోగ అవకాశాలు, అధిక ఆదాయం మాత్రమే కాకుండా.. నగరంలోని ఎంటర్టైన్మెంట్, సంస్కృతి, ఫుడ్, సామాజిక జీవనం, కొత్త అనుభవాలు, జీవనశైలి కూడా ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. గతేడాది అగ్రస్థానంలో ఉన్న బ్యాంకాక్‌ను దాటి టోక్యో టాప్‌లోకి రావడం ఈ మారుతున్న యువత అభిరుచులకు నిదర్శనంగా కనిపిస్తోంది.





