పశ్చిమ బెంగాల్లో మరోసారి తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌ను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హలిశహర్‌లో నిరసనకారులు అడ్డుకున్నారు. పోలీసు కస్టడీలో మృతి చెందిన టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె అక్కడికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిరసనకారులు మమతా బెనర్జీ వాహనాన్ని చుట్టుముట్టి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత వాహనంపై బురద, రాళ్లు, చెప్పులు వంటి వస్తువులు విసిరినట్లు మమతా బెనర్జీ ఆరోపించారు.పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మమతా బెనర్జీ కాన్వాయ్‌ను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఈ ఘటనతో హలిశహర్‌లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన వాహనంపై పెద్ద రాళ్లు విసిరారని మమతా బెనర్జీ ఆరోపించారు. కారు అద్దాలు తెరిచి ఉంటే తీవ్రంగా గాయపడే అవకాశం ఉండేదని ఆమె వ్యాఖ్యానించారు. తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ తగిన భద్రత కల్పించలేదని ఆరోపించారు.ఈ ఘటన వెనుక కుట్ర ఉందని దీదీ అనుమానం వ్యక్తం చేశారు. బెంగాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ఇక.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని రాళ్లు విసరడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ దాడిని హత్యాయత్నంగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు.మాకేం సంబంధం లేదు.. ఖండించిన బీజేపీమమతా బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిపై బీజేపీ స్పందించింది. ఈ ఘటనను ఖండిస్తూ.. రాళ్లు, బురద, చెప్పులు విసరడాన్ని తమ పార్టీ సమర్థించదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తెలిపారు. ఇలాంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. బీజేపీ నేత, మంత్రి అగ్నిమిత్ర పాల్ కూడా ఈ దాడిని ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం తమ రాజకీయ సంస్కృతిలో లేదని చెప్పారు. బీజేపీ పేరుతో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే అది తప్పేనని స్పష్టం చేశారు.టీఎంసీ కార్యకర్త మృతి తర్వాతే వివాదంమమతా బెనర్జీ కాన్వాయ్‌పై నిరసనకు ప్రధాన కారణంగా బిర్జు కియోట్ మృతి వ్యవహారం నిలిచింది. టీఎంసీ కార్యకర్తగా ఉన్న కియోట్ను అవినీతి, వసూళ్ల ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీస్ కస్టడీలో ఆరోగ్యం క్షీణించడంతో కియోట్ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆయన మృతి చెందినట్లు సమాచారం.కియోట్ మృతికి గుండెపోటే కారణమని పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం కస్టడీలో పోలీసులు కొట్టడం వల్లే మరణించారని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కియోట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు హలిశహర్కు మమతా బెనర్జీ వెళ్లిన నేపథ్యంలోనే.. ఆమె కుటుంబాన్ని కలవకముందే కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఒకవైపు ఈ ఘటనను మమతా బెనర్జీ, టీఎంసీ నేతలు కుట్రగా అభివర్ణిస్తుండగా.. మరోవైపు బీజేపీ తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. పోలీసు కస్టడీలో బిర్జు కియోట్ మృతి, దానిపై కుటుంబ సభ్యుల ఆరోపణలు, ఆ తర్వాత మమతా బెనర్జీ పర్యటన సందర్భంగా జరిగిన నిరసనతో బెంగాల్ రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు వివరాలు, బాధ్యులపై తీసుకునే చర్యలు వెలువడాల్సి ఉంది.





