
ఇంటర్నెట్ డెస్క్: ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి టెక్నాలజీ మీద ఆసక్తితో కార్పొరేట్ రంగంలో అడుగుపెట్టారు. సాధారణ ఉద్యోగిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ‘టాటా గ్రూప్’లో దిగ్గజ నాయకుడిగా చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు అనూహ్య పరిణామాలతో తన పదవిని వీడుతున్నారు. టాటా సన్స్ (Tata Sons) ఛైర్మన్ పదవి నుంచి నటరాజన్ చంద్రశేఖరన్ (N Chandrasekaran) వైదొలుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రస్థానాన్ని ఓసారి చూస్తే..
2009లో చంద్రశేఖరన్ టీసీఎస్ బాధ్యతలు అందుకున్నప్పుడు కంపెనీ కష్టకాలంలో కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం దెబ్బతో కుదేలైన ఈ ఐటీ సంస్థను.. చంద్రశేఖరన్ తన నాయకత్వంలో ఆర్థిక విపత్తు నుంచి బయటపడేశారు. కంపెనీ ఆదాయన్ని భారీగా పెంచడంలో విశేష కృషి అందించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ వార్షిక ఆదాయం 20 బిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. దేశంలో అత్యంత విలువైన టెక్ కంపెనీగా అవతరించింది.
సైరస్ మిస్త్రీ-టాటాల వివాదం తర్వాత.. టాటా గ్రూప్ పలు సవాళ్లను ఎదుర్కొంది. ఆ సమయంలో టాటా సన్స్ ఛైర్మన్ పగ్గాలను అందుకున్నారు చంద్రశేఖరన్. 2016 అక్టోబరులో టాటా సన్స్ బోర్డులో చేరిన ఆయన.. 2017లో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. టాటా కుటుంబం నుంచి కాకుండా.. ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తి, పార్సీయేతర వ్యక్తిగా నిలిచారు. ఆయన సమర్థవంతమైన నాయకత్వాన్ని గుర్తించి.. 2022లో రెండో దఫా కూడా ఛైర్మన్ బాధ్యతల్లో కొనసాగించారు. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు చంద్రశేఖరన్ అత్యంత సన్నిహితుడు.
చంద్రశేఖరన్ హయాంలో టాటా గ్రూప్ కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. సెమీకండక్టర్ తయారీ, టాటా డిజిటల్ ఓమ్ని ఛానల్ ప్లాట్‌ఫాం టాటా న్యూ ప్రారంభంతో పాటు ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు, ఫార్మసీ, ష్యాషన్ సంస్థల కొనుగోళ్లను చేపట్టారు. ఆయన నాయకత్వంలో గుర్తుండిపోయే ఘట్టం.. ఎయిరిండియాను ప్రభుత్వం నుంచి మళ్లీ టాటాల చేతుల్లోకి తీసుకురావడం. ఇందులో ఆయన కీలక పాత్ర పోషించారు. 2022లో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఎయిరిండియా-విస్తారాను విలీనం చేసి ఏవియేషన్ రంగంలో కంపెనీని మరింత విస్తరించారు. చంద్రశేఖరన్ నేతృత్వంలో టాటా గ్రూప్ ఆదాయం రెండింతల వరకు పెరగ్గా.. నికర లాభం, మార్కెట్ విలువ మూడింతలకు పైగా పెరగడం విశేషం.
కార్పొరేట్ నాయకుడిగా టెక్ ప్రపంచానికి ఎంతగానో సుపరిచితుడైన చంద్రశేఖరన్.. ఓ మారథాన్ రన్నర్ అని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. 40 ఏళ్ల వయసులో మధుమేహం బారిన పడటంతో ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ఆయన వైద్యుల సలహాతో రన్నింగ్‌ను ప్రారంభించారు. బోస్టన్, న్యూయార్క్, లండన్, ముంబయి వంటి నగరాల్లో పలు మారథాన్లను పూర్తిచేశారు. వ్యాపార, పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం 2022లో చంద్రశేఖరన్‌ను పద్మభూషణ్‌తో సత్కరించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





