
ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా గేమ్స్‌ నుంచి తప్పించడం అన్యాయమని.. తనకు చావే గతి అని వీడియో విడుదల చేసిన వుషు అథ్లెట్ దివ్యాంశి (Divyanshi Choudhary) కాస్త శాంతించింది. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కలగజేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. గాయం తీవ్రత గురించి ఫెడరేషన్‌ తనకు నచ్చజెప్పిందని తాజాగా దివ్యాంశి ఓ ప్రకటనలో పేర్కొంది. కోలుకోవడానికి తగినంత సమయం అవసరమని, అందుకే ఎంపిక చేయలేదని వుషు సంఘం వివరణ ఇచ్చినట్లు దివ్యాంశి వెల్లడించింది. మోకాలి గాయం కారణంగా ఆసియా క్రీడల నుంచి పేరును తొలగించడంతో ఆత్మహత్య చేసుకుంటానని దివ్యాంశి హెచ్చరించిన విషయం తెలిసిందే.
‘‘భవిష్యత్తులో భారత్‌ ( India ) కోసం పతకాలు సాధించాలంటే ఆరోగ్యం అత్యంత ముఖ్యమని నాకు అర్థమయ్యేలా ఫెడరేషన్‌ వివరించింది. ఇప్పటి వరకూ నాకు ఫెడరేషన్‌ అండగా లేదని అనుకున్నా. కానీ, వారి మద్దతు ఉందని అర్థమైంది. 2030 ఆసియా క్రీడల్లో ( Asian Games ) స్వర్ణ పతకం సాధించే దిశగా ప్రోత్సహిస్తారనడంలో నాకెలాంటి సందేహం లేదు. గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవాలనేదే ఫెడరేషన్ ఉద్దేశం. కానీ, మొదట్లో నాకు అర్థం కాలేదు. గాయం నుంచి కోలుకోవడం ఎంత ముఖ్యమో క్రీడల మంత్రి వివరించారు. తప్పకుండా మళ్లీ గేమ్‌లోకి అడుగు పెడతా. అందుకు ఫెడరేషన్, సాయ్ పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడతా. తదుపరి గేమ్స్‌ కోసం సన్నద్ధం కావాలని తల్లిదండ్రులు చెప్పారు’’ అని దివ్యాంశి (Divyanshi Choudhary) తెలిపింది.
ఫెడరేషన్ విషయంలో వెనక్కి తగ్గిన దివ్యాంశి.. తన స్థానంలో ఆసియా గేమ్స్‌కు ఎంపికైన రోషిబినాపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రోషిబినా (ROSHIBINA) నన్ను తీవ్రంగా వేధించింది. మానసికంగా, శారీరకంగానూ హింసించింది. ఓ అథ్లెట్ ఇలాంటి నీచ స్థాయికి దిగజారుతుందని అనుకోలేదు. జూన్ నుంచి ఇప్పటి వరకూ అదే ప్రవర్తన. నాతోపాటు నా కుటుంబాన్ని వేధించింది’’ అని దివ్యాంశి ఆరోపించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






