
ఇంటర్నెట్‌డెస్క్: ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ (PM Modi) యువత లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రకటించారు. కోటి మంది యువతకు ఏఐ (AI) నైపుణ్యాలలో శిక్షణ ఇస్తామని, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే.. ఉచిత కోచింగ్ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు. అలాగే ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న జనగణన గురించి ప్రస్తావించారు. దానిలో చురుగ్గా పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు.
‘‘నేను అందరినీ ఒక ఫేవర్ చేయాలని అడుగుతున్నాను. ఒక గంటా, రెండు గంటల సమయం కేటాయించండి. అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ మాత్రం సమయం దేశాన్ని ఎలా బలోపేతం చేస్తుందా..? అని యువత ఆలోచిస్తూ ఉండొచ్చు. వారి భాగస్వామ్యంతో ప్రతి ఇంట్లో జనాభా గణనకు ఒక అనుకూల వాతావరణం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. గణన అంటే లెక్కలన్నీ ఒక దగ్గర రాసుకోవడం కాదు. జనాభా లెక్కల సమయంలో ప్రజలు ఇచ్చే వివరాల ఆధారంగానే జాతీయ విధానాలు, పథకాలు రూపుదిద్దుకుంటాయి. దేశ ప్రగతికి ఆ లెక్కలు సూచీగా ఉంటాయి. అందుకే కచ్చితమైన, స్పష్టమైన సమాచారం ఇవ్వడం అత్యంత కీలకం’’ అని మోదీ పేర్కొన్నారు.
అలాగే ‘దిమాగీ నక్సల్స్’ గురించి మాట్లాడుతూ.. వారిని దేశానికి కొత్త శత్రువులుగా అభివర్ణించారు. ‘‘సంవత్సరాలుగా మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు దేశంలో బలంగా పాతుకుపోయారు. అడవుల్లోని సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించి, ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది. సాయుధ నక్సల్స్ కనుమరుగైనా.. ‘దిమాగీ నక్సల్స్’ మిగిలి ఉన్నారు. వారు ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి లాగడానికి వారు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మనం వారిని గుర్తించి..ఒంటరివాళ్లని చేయాలి’’ అని సూచించారు.
తయారీ, వ్యవసాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగం, గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ, ఇండియాస్ సాఫ్ట్ పవర్ కోసం ‘సప్తధార’ రోడ్‌మ్యాప్‌ను మోదీ ప్రకటించారు (Independence Day).
మహిళా కోటా బిల్లుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో.. తన ప్రసంగంలో దాని ప్రస్తావన తీసుకువచ్చారు. ప్రతిపక్షాలు విభేదాలను పక్కనపెట్టి.. పార్లమెంట్, శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు సహకరించాలని కోరారు.
స్వాతంత్ర్య వేడుకల్లో ఈసారి కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదు. సీటింగ్, ఇతర ప్రొటోకాల్స్ వారి పదవులకు అనుగుణంగా ఉండటం లేదని కాంగ్రెస్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు వరుసగా రెండోసారి గైర్హాజరయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని తమిళనాడు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.





