దాయాది పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టింది. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నేతలు దిగిన గ్రూప్ ఫోటో పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం షేర్ చేసింది. అయితే, ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేకుండా క్రాప్ చేసి.. షెహబాజ్ షరీఫ్ మాత్రమే మధ్యలో ఉన్నట్లుగా చూపించింది. పాకిస్థాన్ ప్రధాని షేర్ చేసిన ఆ ఫోటోలో కేవలం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తజికిస్థాన్ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మాన్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్, కిర్గిజ్ కల్నల్ ఉలార్బెక్ జార్లికోవిచ్ షార్షీవ్ మాత్రమే కనిపించారు. వారి మధ్యలో తాను నిలబడి ఉన్నట్టు షెహబాజ్ బిల్డప్ ఇచ్చారు.ఎస్సిఓ సమ్మిట్ సెషన్‌కు ముందు సభ్యదేశాల నాయకులందరూ కలిసిన సమయంలో ఈ ఫోటో తీశారు. అంతటితో ఆగకుండా ఎస్సీఓ నేతలు రౌండ్‌టేబుల్ సమావేశమైన ఒక వీడియోలోనూ మోదీ ఉన్న భాగాన్ని ఎడిట్ చేసి, తొలగించింది. ఆ వీడియోను షెహబాజ్ షరీఫ్ తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశారు.అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఒరిజినల్ ఫోటోను షేర్ చేయడంతో అసలు విషయం బయటపడింది. వాస్తవానికి షెహబాజ్ కుడివైపు నుంచి నాలుగో స్థానంలో నిలబడి ఉండగా.. మరో ఐదుగురు నేతలను ఆ ఫోటో నుంచి క్రాప్ చేశారని స్పష్టమైంది.దీంతో పాకిస్థాన్ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు, సహకారాన్ని పెంపొందించడానికి నిర్వహించిన ఈ 26వ ఎస్సీఓ లీడర్షిప్ సమ్మిట్‌లో 10 సభ్యదేశాలు, 15 భాగస్వామ్య దేశాలు, రెండు పరిశీలక దేశాలు పాల్గొన్నాయి.ఎస్సీఓ సమ్మిట్‌లో మోదీ ప్రసంగంకిర్గిజిస్థాన్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలను వివరించారు. ప్రపంచ ఇంధన సరఫరాలు, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్న పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.10 మంది సభ్యులు ఉన్న షాంఘై సహకార సంస్థ (SCO)ను 2001లో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లు కలిసి ఏర్పాటు చేశాయి. భారత్, పాకిస్థాన్‌లు 2017లో పూర్తిస్థాయి సభ్యదేశాలుగా చేరగా.. ఆ తర్వాత 2023లో ఇరాన్, 2024లో బెలారస్ సభ్యత్వాలు పొందాయి.ఎస్సిఓ మూడు ప్రధాన పిల్లర్స్ ‘భద్రత, అనుసంధానత, అవకాశాలు’ చుట్టూ మరింత బలమైన సహకారం ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేవలం ప్రణాళికలకే పరిమితం కాకుండా, స్పష్టమైన ఫలితాలను సాధించే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.





