విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్కు పరిశ్ర భద్రతకు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) బలగాల ఉపసంహరణ కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపినట్లు సౌత్ సెక్టార్, హెడ్‌క్వార్టర్స్ చెన్నై నుంచి సమాచారం వచ్చినట్లు సమాచారం. 2026 నవంబరు 17 నుంచి సెక్యూరిటీ, ఫైర్ వింగ్‌లలో ఉన్న బలగాలను ఉపసంహరించాలని అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆర్డర్ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ప్రక్రియను మూడు నెలల నోటీస్ పిరియడ్ తర్వాత చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈలోగా విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి సీఐఎస్ఎఫ్కు రావాల్సిన బకాయిలన్నీ ముందుగా చెల్లించాలని కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీఐఎస్ఎఫ్ బలగాల ఉపసంహరణను ఉక్కు పరిశ్రమ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. అంతేకాదు గతంలో సుమారు 400 మంది వరకు సీఐఎస్ఎఫ్, సెక్యూరిటీ, ఫైర్ విభాగం సిబ్బందిని తొలగించారు. అనంతరం వారి స్థానంలో ఏపీ స్పెషల్ ఫోర్స్ బలగాలను నియమించిన సంగతి తెలిసిందే.విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 2024 వరకూ 1500 మంది వరకు సీఐఎస్ఎఫ్ బలగాలు విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత దశల వారీగా సిబ్బంది ఉపసంహరించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో కొనసాగుతున్న 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బందిని ఉపసంహరించాలని కేంద్రం హోంశాఖ ఆదేశాలు జారీ చేసిందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌లోని సీఎస్ఎఫ్ బలగాలకు సంబంధించి.. భద్రతా విభాగంలో 1,033మంది.. అగ్నిమాపక విభాగంలో 298మంది ఉన్నారు.ఉపసంహరణ తర్వాత, CISF సెక్టార్ ఇన్స్పెక్టర్ జనరల్ నుండి నో-డ్యూస్ సర్టిఫికేట్‌తో పాటు ఒక కంప్లయన్స్ రిపోర్ట్‌ను సమర్పిస్తుంది . దశాబ్దాలుగా భారతదేశంలోని ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలు మరియు కీలక పారిశ్రామిక సంస్థల భద్రతా వ్యవస్థలో సీఐఎస్ఎఫ్ ఒక అంతర్భాగంగా ఉంది. సీఐఎస్ఎఫ్ ఎన్నో పారిశ్రామిక సంస్థలలో భద్రతతో పాటుగా ఫైర్ వంటి బాధ్యతలను నిర్వహిస్తోంది. సీఐఎస్ఎఫ్ భద్రతను ఉపసంహరిస్తే అక్కడ భద్రతాపరమైన బాధ్యతల సంగతేంటనే చర్చ జరుగుతోంది.. ఏపీ స్పెషల్ ఫోర్స్ బలగాలను నియమిస్తారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.





