
Kothapeta: తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ 6వ వార్షికోత్సవం
కొత్తపేట: బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ 6వ వార్షికోత్సవాలకు కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారితో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ.. తన తండ్రి వెంకటస్వామి గారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి తనకు కార్మికుల సమస్యలపై అవగాహన ఉందన్నారు. కుకింగ్ గ్యాస్ డెలివరీ కార్మికులే కాకుండా.. ఎక్కడ పని చేసే కార్మికులకైనా కనీస వేతనాలు అమలు కావాలన్నది తమ ప్రభుత్వ అభిమతమన్నారు.
కార్మిక శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు వివరించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. గిగ్ వర్కర్లకు కూడా ప్రత్యేక చట్టాన్ని చేసి రక్షణ కల్పిస్తున్నట్లు వివరించారు.
మధుయాష్కి గారు మాట్లాడుతూ... కార్మికుల పక్షపాతిగా మంత్రి వివేక్ గారు పనిచేస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు . రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు గిగ్ వర్కర్లకు కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. అమెరికాలోని భారత కాన్సులేట్ లో తాను పని చేస్తున్నప్పటి నుంచి వెంకటస్వామి గారితోపాటు వారి కుటుంబ సభ్యులతో తనకు అనుబంధం ఉందన్నారు.
వెంకటస్వామి గారిని నాన్న అని పిలిచేవాడినని గుర్తు చేసుకున్నారు. మంత్రి వివేక్ గారు సమర్థవంతంగా పనిచేస్తున్నారని.. మంచి ఇండస్ట్రియలిస్ట్ గా కూడా పేరు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏటా తమ కంపెనీ ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తు చేశారు. కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చేలా జీవో విడుదల చేసి అమలు చేయడం మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి పేద వర్గాల పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం అన్నారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత ముద్దగోని రామ్మోహన్ గౌడ్ గారు కూడా మాట్లాడారు. కార్యక్రమంలో జిహెచ్ఎంసి మాజీ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్ గారు, నేలపాటి రామారావు గారు, పన్యాల జైపాల్ రెడ్డి గారు, గణేష్ నాయక్ గారు, కుకింగ్ గ్యాస్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ గారు, చామకూర రాజుగారు, కె.వి గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు.





