Jammu Kashmir Revised Ex-Gratia Norms : ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగంగా పోరాడుతూ.. దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదులుకున్న భద్రతా బలగాల సిబ్బంది కుటుంబాలకు బిగ్ రిలీఫ్ కల్పించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. వీరికి మాత్రమే కాకుండా ఉగ్ర ఘటనల వల్ల ప్రభావితమైన సామాన్య పౌరులకు మరింత అండగా నిలిచేందుకు కూడా సిద్ధమైంది. ముఖ్యంగా భద్రతా సంబంధిత వ్యయం కింద అందించే ఎక్స్‌గ్రేషియా, నష్టపరిహార నిబంధనలను సమూలంగా సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను అధికారికంగా నోటిఫై చేసింది. దీని ప్రకారం.. వీరమరణం పొందిన డిఫెన్స్, పారామిలటరీ జవాన్లకు రూ.25 లక్షలు, అమరులుగా మారిన పోలీసులకు రూ.12 లక్షల నష్టపరిహారాన్ని అందించనున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.సైనికులు, పారామిలటరీ బలగాలకు రూ.25 లక్షలుసరిహద్దుల్లో లేదా ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు అందించే నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. జమ్మూ కాశ్మీర్ స్థానికులైన డిఫెన్స్ లేదా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) సిబ్బంది ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో వీరమరణం పొందితే.. ఆ ఘటన రాష్ట్రం లోపల జరిగినా లేదా వెలుపల జరిగినా.. వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఒకవేళ స్థానికేతరులైన జవాన్లు జమ్మూ కాశ్మీర్ భౌగోళిక సరిహద్దుల్లో జరిగిన ఉగ్ర ఘటనల్లో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందుతుంది.పోలీసు అమరవీరులకు ఆర్థిక భరోసారాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తూ.. సిబ్బంది వీరమరణం పొందితే వారి కుటుంబాలకు మొత్తం రూ.12 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లిస్తారు. ఇందులో రూ.7 లక్షలు పోలీసు వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరు చేయగా.. మిగతా రూ.5 లక్షలను జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి అందజేస్తారు. అలాగే యాక్షన్‌లో ప్రాణాలు కోల్పోయే ప్రత్యేక పోలీసు అధికారులకు అందించే నష్టపరిహారాన్ని రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఉగ్ర దాడుల్లో తీవ్ర గాయాలపాలై శాశ్వత వైకల్యం పొందిన పోలీసు సిబ్బందికి రూ.75,000 సాయం అందుతుంది.ప్రభుత్వ ఉద్యోగులు, పౌరులకు పరిహారం ఎంతంటే?ఉగ్రవాద సంబంధిత ఘటనలు లేదా నియంత్రణ రేఖవెంబడి జరిగే కాల్పుల్లో మరణించే సామాన్య పౌరుల కుటుంబాలకు రూ.1 లక్ష ఎక్స్‌గ్రేషియా లభిస్తుంది. అలాగే అధికారిక విధుల్లో ఉండి ప్రాణాలు కోల్పోయే ప్రభుత్వ ఉద్యోగుల విషయానికొస్తే.. మరణించిన వారు మేజిస్ట్రేట్ హోదాలో ఉంటే వారి కుటుంబానికి రూ.2 లక్షలు, ఇతర సాధారణ ఉద్యోగులు అయితే రూ.1 లక్ష చెల్లిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.75,000, 24 గంటల కంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఉండాల్సిన తీవ్ర గాయాలు అయితే రూ.5,000, 24 గంటల లోపు చికిత్స అవసరమయ్యే గాయాలకు రూ.1,000, కేవలం ప్రథమ చికిత్స సరిపోయే చిన్నపాటి గాయాలకు రూ.500 చొప్పున పరిహారం మంజూరు చేస్తారు.ఈ సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. లొంగిపోయిన ఉగ్రవాదులకు రూ.75,000, అలాగే పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారి ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు రూ.1 లక్ష పరిహారం ఇచ్చేలా ప్రత్యేక నిబంధనలను చేర్చడం గమనార్హం. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ల సమయంలో స్థిర, చరాస్తులు ధ్వంసమైతే గరిష్టంగా ఒక కేసుకు రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు. దీనిలో స్థిరాస్తికి గరిష్టంగా రూ.7 లక్షలు, చరాస్తికి రూ.3 లక్షలు మంజూరు చేస్తారు. లేదంటే అంచనా వేసిన ఆస్తి నష్టం తక్కువగా ఉంటే దీనినే చెల్లిస్తారు. సరిహద్దు అవతల (ఎల్ఓసీ) నుంచి జరిగే షెల్లింగ్ లేదా కాల్పుల వల్ల ఆస్తులకు జరిగే నష్టానికి, అధికారులు అంచనా వేసిన నష్టంలో 50 శాతం పరిహారంగా ఇస్తారు. అలాగే బాంబు పేలుళ్లు, కుట్రపూరిత విధ్వంసాల వల్ల స్థిరాస్తికి నష్టం వాటిల్లితే మదింపు చేసిన నష్టంలో 50 శాతం అందిస్తారు.మంజూరు చేసేది ఎవరంటే?జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమ్ కోఆర్డినేషన్ కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగా ఆయా జిల్లాల సంబంధిత డిప్యూటీ కమిషనర్ ఈ సహాయక నిధిని మంజూరు చేస్తారు. ఒకవేళ డీసీ చేసిన నష్ట పరిహారం అంచనా ఉత్తర్వులపై ఎవరికైనా అసంతృప్తి ఉంటే.. వారు 30 రోజుల వ్యవధిలోగా డివిజనల్ కమిషనర్‌కు అప్పీల్ చేసుకునే సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించింది.




