జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ , ఆయన భార్య బుష్రా బీబీకి భారీ ఉపశమనం లభించింది. వారికి ఇకపై ఏకాంత నిర్బంధం విధించవద్దని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. చట్టం ప్రకారం ఖాన్, ఆయన భార్య సమావేశమయ్యేందుకు వీలు కల్పించాలని అడియాలా జైలు అధికారులకు స్పష్టం చేసింది. జీ ప్రధాని 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో అవినీతి, సంబంధిత కేసుల్లో సుదీర్ఘ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్‌ను ఏకాంత నిర్బంధంలో ఉంచారని ఆరోపిస్తూ ఆయన సోదరి అలీమా ఖాన్ కోర్టును ఆశ్రయించగా.. బుష్రా బీబీ కుమార్తె ముబషరా ఖవార్ మనేకా ఆమెకు సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ ఖాదిమ్ హుస్సేన్ సూమ్రో విచారణ చేపట్టి ఈ తీర్పు వెలువరించారు.జైలు నిబంధనల ప్రకారం ఖాన్‌ను కలవడానికి ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని, అలాగే ఆయన తన కుమారులతో టెలిఫోన్ సంభాషణలు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించాలని, జైలు నిబంధనలకు అనుగుణంగా ఆయనకు వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని సూచించారు. కోర్టు ఆదేశాలను అమలుచేసి, 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని జైలు సూపరింటెండెంట్‌కు జస్టిస్ ఖాదిమ్ స్పష్టం చేశారు.జైలులో ఇమ్రాన్ ఖాన్ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి జైలులోనే ఉన్నారు. కుటుంబ సభ్యులను కలవకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, సరైన వైద్య సంరక్షణ కూడా అందజేయడం లేదని ఆయన మద్దతుదారులు, బంధువులు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. అవినీతికి సంబంధించిన కేసులో దోషిగా తేలడంతో బీబీని 2024 జనవరి 31న జైలుకు పంపారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అదే ఏడాది అక్టోబర్ 24న ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.మరో అవినీతి కేసులో దోషిగా తేలడంతో ఆమెను 2025 జనవరి 17న తిరిగి అరెస్టు చేశారు. అప్పటి నుంచి అవినీతి సంబంధిత కేసులలో అదనపు శిక్షలు కూడా పడటంతో అడియాలా జైలులోనే నిర్బంధంలో ఉన్నారు.గత నెలలో ఖాన్ ఆరోగ్యం ముఖ్యంగా కంటి సమస్యపై ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఆందోళనల నేపథ్యంలో ఆయనను ప్రైవేటు యాజమాన్యంలోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు తరలించాలని ప్రభుత్వాన్ని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ, ఆగస్టు 20-21 తేదీల్లో ఖాన్‌ను షిఫా హాస్పిటల్‌కు బదులుగా రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వ ఆధీనంలోని పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS)లో చేర్పించారు. ఆ తర్వాత ఆయనను తిరిగి ఆడియాలా జైలుకు తీసుకువెళ్లారు.




