
డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంతో, ఆన్లైన్ లావాదేవీలు మన దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారాయి. ఆన్లైన్లో షాపింగ్ చేయడం, నిధులను బదిలీ చేయడం లేదా వ్యాపారం చేయడం వంటి ఏ విషయంలోనైనా, డిజిటల్ లావాదేవీల సౌలభ్యం మనం ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఆన్లైన్ లావాదేవీలలో మోసాలను నివారించడానికి డిజిటల్ సంతకాలు ఒక శక్తివంతమైన సాధనంగా ఆవిర్భవించాయి. ఎలక్ట్రానిక్ పత్రాల ప్రామాణికతను ధ్రువీకరించడానికి, సంతకం చేసేవారి గుర్తింపును నిర్ధారించడానికి సురక్షితమైన, ట్యాంపర్-ప్రూఫ్ పద్ధతిని అందించడం ద్వారా, ఆన్లైన్ లావాదేవీల భద్రత, విశ్వసనీయతను పెంచడంలో డిజిటల్ సంతకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆన్లైన్ లావాదేవీల్లో మోసాలను నివారించడానికి ఇవి ఎలా దోహదపడుతున్నాయో తెలుసుకుందాం.
డిజిటల్ సంతకమనేది ఒక డిజిటల్ పత్రం లేదా సందేశానికి సంబంధించిన సమగ్రతను, ప్రామాణికతను ధ్రువీకరించడానికి ఉపయోగించే ఒక క్రిప్టోగ్రాఫిక్ పద్ధతి. ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపును చేతితో రాసి తెలిపే సంప్రదాయ సంతకానికి భిన్నంగా, క్రిప్టోగ్రాఫిక్ కీలను ఉపయోగించి రూపొందించిన ఒక గణిత అల్గారిథమే డిజిటల్ సంతకం. సంతకం చేసే వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ కీతో పాటు, సంతకం చేస్తున్న పత్రం లేదా సందేశంలోని విషయానికి ఒక గణిత ఫంక్షన్‌ను వర్తింపజేయడం ద్వారా డిజిటల్ సంతకాలు సృష్టిస్తారు.
ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పణలు చేయడానికి లేదా ఇ-టెండర్లలో పాల్గొనడానికి, అద్దె ఒప్పందాలు, ఉద్యోగ ఒప్పందాలు వంటి వ్యక్తిగత చట్టపరమైన పత్రాల కోసం డిజిటల్ సంతకాలను ఉపయోగించవచ్చు. పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలో రూపొందించి, ప్రాసెస్ చేసిన పత్రాలకు ఇ-సంతకాలు ఉత్తమంగా సరిపోతాయి. ఇవి వేగం, భద్రత, చట్టపరమైన చెల్లుబాటును నిర్ధారిస్తాయి.
వీలునామాలు, రిజిస్ట్రేషన్, భౌతిక సంతకాలు అవసరమయ్యే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ వంటి కొన్ని ఆస్తి పత్రాలు, పవర్ ఆఫ్ అటార్నీ, ట్రస్ట్ డీడ్లు లాంటి వాటిలో వీటిని అంగీకరించరు. ఇంకా, కోర్టులు కేవలం క్రిప్టోగ్రాఫిక్ రుజువుపై కాకుండా, మానవ సాక్ష్యం భౌతిక ధ్రువీకరణపై ఆధారపడతాయి. అందుకే, డిజిటల్ సంతకాలకు భద్రత ఉన్నప్పటికీ, అవి వీలునామా పత్రాలకు సరిపోవు.
ఒక వ్యక్తి కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీస్(CCA) ద్వారా నియంత్రించబడే లైసెన్స్ పొందిన సర్టిఫైయింగ్ అథారిటీ నుంచి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్(DSC) పొందవచ్చు. ఇ-ముద్ర, ప్రోటీన్, CDSL వెంచర్స్, CSCతో సహా సుమారు 23 సర్టిఫికేషన్ అథారిటీ(CA)లు ఉన్నాయి. ఆ వ్యక్తి పాన్, ఆధార్, KYC వివరాలను సమర్పించి, ధ్రువీకరణ ప్రక్రియను(వీడియో లేదా భౌతిక) పూర్తి చేయాల్సి ఉంటుంది. DSC సర్టిఫికేట్ ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉంటుంది. తరగతి, చెల్లుబాటును బట్టి దీని ధర రూ.1,000 నుంచి రూ.3,000 మధ్య ఉంటుంది. ఈ సంతకం USB టోకెన్ వంటి హార్డ్‌వేర్ పరికరంలో సురక్షితంగా ఉంచుతారు. దీనివల్ల ఆ వ్యక్తి మాత్రమే దాన్ని ఉపయోగించడానికి వీలుంటుంది.
డిజిటల్ సంతకానికి, సంప్రదాయ సంతకానికి మధ్య ఉన్న ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే..డిజిటల్ సంతకం, క్రిప్టోగ్రాఫిక్ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల దాన్ని డూప్లికేట్ చేయడం లేదా తారుమారు చేయడం చాలా కష్టం. సులభంగా నకలు చేయగల లేదా తారుమారు చేయగల చేతితో రాసిన సంతకాలతో పోలిస్తే ఇది అధిక స్థాయి భద్రతను, నమ్మకాన్ని అందిస్తుంది. డిజిటల్ సంతకానికి సంబంధించిన ముఖ్య భాగాలలో క్రిప్టోగ్రాఫిక్ అల్గారిథంలు, పబ్లిక్-కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్(PKI) అని పిలిచే అంతర్లీన మౌలిక సదుపాయాలు ఉంటాయి. డిజిటల్ సంతకాలు సంతకం చేసేవారి గుర్తింపును ప్రామాణీకరించడానికి ఒక పటిష్టమైన మార్గాన్ని అందిస్తాయి. క్రిప్టోగ్రాఫిక్ కీలను ఉపయోగించడం వల్ల ఇది ప్రత్యేకంగా సంతకం చేసేవారికి మాత్రమే కేటాయిస్తారు. దాన్ని నకిలీ చేయడం వీలుకాదు.
ఈ అథెంటికేషన్ ప్రక్రియ..ఖాతాలకు అనధికారిక ప్రాప్యతను నిరోధించడంలో సహాయపడి గుర్తింపు చోరీ నుంచి రక్షిస్తుంది. డిజిటల్ సంతకాలు లావాదేవీ డేటాకి సంబంధించిన వివరాలను నిర్ధారిస్తాయి. డిజిటల్ సంతకం చేసిన తర్వాత సంతకం చేసిన పత్రం లేదా సందేశంలో ఏదైనా మార్పు చేస్తే, ధ్రువీకరణ సమయంలో సంతకం చెల్లదు. ఈ ట్యాంపర్-ప్రూఫ్ ఫీచర్ అనధికారిక మార్పుల నుంచి కాపాడి, లావాదేవీకి సంబంధించిన సమగ్రతను నిర్ధారిస్తుంది.
క్రిప్టోగ్రాఫిక్ అల్గారిథంలు డిజిటల్ సంతకాల ద్వారా డిజిటల్ పత్రాల సమగ్రతను, అథెంటికేషన్‌ను ధ్రువీకరించి, ఉన్నత స్థాయి భద్రతను అందిస్తాయి. ఇది సంతకం చేసేవారి గుర్తింపు ధ్రువీకరణ జరిగిందని, పత్రం తారుమారు అవ్వలేదని నిర్ధారిస్తుంది. అధీకృత వ్యక్తులు మాత్రమే పత్రాలపై సంతకం చేయగలరని, వాటిని యాక్సెస్ చేయగలరని నిర్ధారణ అవుతుంది. తద్వారా మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన ప్రమాదాలు ఉండవు. డిజిటల్ సంతకాలతో పాటు ఒక సమగ్ర డిజిటల్ ఆడిట్ ట్రెయిల్ కూడా ఉంటుంది. ఇది సంతకం చేసిన సమయం, సంతకం చేసేవారి గుర్తింపు ధ్రువీకరణ, సంతకం ప్రక్రియలోని ప్రతి దశ వంటి వివరణాత్మక ఈవెంట్ సమాచారాన్ని సంగ్రహిస్తుంది. ఇది మెరుగైన ట్రాకింగ్, పర్యవేక్షణకు వీలు కల్పిస్తుంది. దీని ద్వారా ఏవైనా అనుమానాస్పద లేదా మోసపూరిత కార్యకలాపాలను గుర్తించడం సులభం అవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




