మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. విజయవాడలో వల్లభనేని వంశీ వంగవీటి రాధాను కలిశారు.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వల్లభనేని వంశీ తన అనచరుడు కంఠమనేని శ్రీనివాసరావుతో వెళ్లి వంగవీటి రాధాను కలిశారు. కంఠమనేని శ్రీనివాసరావు తన కుమారుడి వివాహ వేడుకకు రాధాను ఆహ్వానించారు.. ఈ సందర్భంగా వంశీ, రాధాలుఒకర్ని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంచి స్నేహితులు.. గతంలో సన్నిహితంగా ఉండేవారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా సరే ఇప్పటికి వారి స్నేహం మాత్రం కొనసాగుతోంది. వంగవీటి రాధా , వల్లభనేని వంశీలు పార్టీలు వేరైనా సరే కుటుంబానికి సంబంధించి కార్యక్రమాలకు మాత్రం ఆహ్వానించుకుంటున్నారు. గతేడాది వంగవీటి రాధా కుమార్తె రుధిర నామకరణ కార్యక్రమానికి మాజీ మంత్రి కొడాలి నాని.. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, జక్కంపూడి రాజాతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొడాలి నాని, వల్లభనేని వంశీతో స్నేహం ఉండటంతోనే వీరిని రాధా ఆహ్వానించారు. ఆ సమయంలో వంగవీటి రాధా, కొడాలి నాని, వల్లభనేని వంశీలు కలిసి ఫోటోలు దిగగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే రాజకీయాలు, స్నేహాన్ని వేర్వేరుగా చూడాలని నెటిజన్లు స్పందించారు.వంగవీటి రాధాకృష్ణ తన తల్లిదండ్రుల వారసత్వంతో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికలకు ముందు రాధా కాంగ్రెస్ పార్టీని వీడి మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడారు. వంగవీటి రాధా 2014 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు.. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ అయ్యారు.. అనంతరం అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. 2024 ఎన్నికల సమయంలో రాధా మళ్లీ యాక్టివ్ అయ్యారు.. కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అయితే వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించారు.. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు.




