EPS Pension: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పరిధిలోని ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 1995 (EPS-1995) కింద లభించే కనీస పెన్షన్ పెంపుపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంపు ఉండాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న నెలకు కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.7500లకు పెంచాలని కోరుతున్నారు. అలాగే కరువు భత్యం (Dearness Allowance) అందించాలనే డిమాండ్ ఉంది. ఈ అంశంపై మరోసారి పార్లమెంటులో చర్చకు వచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.ఈపీఎస్ 95 కింద అందించే కనీస పెన్షన్ రూ.7500లకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5, 2026 రోజున ఢిల్లీలో ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ధరలకు ఇస్తోన్న కనీస పెన్షన్ రూ.1000 అనేది సరిపోవడం లేదని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంపు ఉండాలని కోరారు. ఆగస్టు 10, 2026 సోమవారం రోజున ఈ అంశంపై లోక్‌సభలోనూ చర్చకు వచ్చింది. పార్లమెంట్ సభ్యుడు రామ్‌వీర్ సింగ్ బిధూరీ ఈ అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఈపీఎస్ 1995 పరిధిలో ఎంత మందికి అధిక పెన్షన్ అవకాశం కల్పించారని ప్రశ్నించారు.కేంద్రం సమాధానం ఇదేఎంపీ బిధూరి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉపాధి, కార్మిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శోభా కరాంద్లేజ్ సమాధానం ఇచ్చారు. కనీస ఈపీఎస్ పెన్షన్ ఎప్పుడు పెంచుతారు అనే అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా కేంద్రం వైఖరిని వెల్లడించారు. ఉద్యోగులకు వేతనంపై అదనంగా 1.16 మద్దతు ఇస్తూనే ఈపీఎస్ పెన్షన్ అందిస్తోందని స్పష్టం చేశారు. ' ఎంప్లాయిస్ పెన్షన్ ఫండ్ అనేది ఉద్యోగి వేతనంలో 8.33 శాతం కాంట్రిబ్యూషన్, కేంద్ర ప్రభుత్వం నుంచి 1.16 శాతం కాంట్రిబ్యూషన్తో కలిపి ఉంటుంది. అలాంటి లెక్కలన్నింటిని తీసుకుని అన్ని బెనిఫిట్స్ అందిస్తున్నాం. ఈపీఎస్ 1995, ప్యారా 32 ప్రకారం ఈ ఫండ్ వార్షికంగా జమ అవుతుంటుంది.EPS, 1995 పరిధిలోని పెన్షనర్లకు ప్రభుత్వం బడ్జెట్ మద్దతు ద్వారా నెలకు కనీసం రూ. 1,000 పెన్షన్‌ను అందిస్తోంది.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కు EPS నిమిత్తం ఏటా అందించే వేతనాల్లో 1.16 శాతం మేర బడ్జెట్ మద్దతుకు అదనంగా ఈ సదుపాయం కల్పింస్తోంది.' అని కేంద్ర మంత్రి తెలిపారు.లక్షలాది మంది పీఎఫ్ పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్న ఈ కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదనపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అలాగే పెన్షన్ పెంపుతో పాటు ఈపీఎస్ 95 పెన్షనర్లు, వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య సౌకర్యాలు అందించాలని ఉద్యోగులు కోరుతున్నారు.