
Jangaon: బడుల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి కలెక్టర్
జనగామ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారి సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారి సందీప్ కుమార్ ఝా ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రవేశాలు పెరిగిన పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, పాఠశాలల తనిఖీలు, తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు ఉండేలా వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య అవసరానికి మించి ఉండగా, మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండే పరిస్థితి ఉండకూడదన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలను గుర్తించి, అవసరమైన మేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఏ పాఠశాల కూడా సింగిల్ టీచర్ పాఠశాలగా ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో బోధన అందించాలని, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా పని చేయాలన్నారు. “ఫోకస్‌తో పనిచేస్తే విద్యా రంగంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ప్రతి చర్య చివరికి విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి” అని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని పాఠశాలలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, బోధనా ప్రక్రియ, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తదితర అంశాలను పరిశీలించాలని సూచించారు. "మిషన్ శిఖరం" కార్యక్రమం కింద జిల్లాలోని ప్రతి పాఠశాల పరిస్థితిపై స్పష్టమైన నివేదిక వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా పకడ్బందీగా రూపొందించాలని ఆదేశించారు.
పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఏ పాఠశాలలోనైనా భవనం, తరగతి గదులు, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులకు సంబంధించి మరమ్మతులు అవసరమైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణంలో చదువుకునేలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని అన్నారు.
ఉపాధ్యాయులు పాఠశాలల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, ఉపాధ్యాయుల కేటాయింపులో అవసరాన్ని ప్రాధాన్యతగా తీసుకొని, ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ముందుగా సర్దుబాటు చేయాలని ఆదేశించారు. మహిళా ఉపాధ్యాయులకు అవసరమైన సందర్భాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. పాఠశాలల అవసరాలు, విద్యార్థుల సంఖ్య, బోధనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని తెలిపారు.
జిల్లాలోని CRTs (క్లస్టర్ రిసోర్స్ టీచర్లు) తమ పరిధిలోని పాఠశాలలను నిరంతరం సందర్శిస్తూ, విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. CRTలు కేవలం నివేదికలు సమర్పించడం కాకుండా, పాఠశాలల్లో వాస్తవ పరిస్థితులను పరిశీలించి, ఉపాధ్యాయులకు అవసరమైన అకడమిక్ సపోర్ట్ అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
అన్ అకాడమీ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని తెలిపారు. అదే విధంగా ‘ఫాస్ట్ మ్యాథ్స్’ పుస్తకాలను విద్యార్థులతో నిరంతరం సాధన చేయించాలని సూచించారు. గణితంపై విద్యార్థుల్లో ఆసక్తి, వేగం, ప్రాథమిక నైపుణ్యాలు పెంపొందించేలా రోజువారీ అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి పాఠశాల, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి అధికారి తమ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తూ విద్యార్థుల ప్రయోజనమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, తదితరులు పాల్గొన్నారు.
28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.




