ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులకు ముఖ్యగమనిక. సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు, అభిమానులు పరస్పర విమర్శలు చేసుకోవద్దని కూటమి తరఫున సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ కోరింది. ఒకవేళ ఎవరైనా హద్దు మీరితే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు ఫేక్ అకౌంట్లు, సూడో అభిమానులు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు.'ఇటీవల మన పార్టీ అభిమానులు, కార్యకర్తల ముసుగులో కొన్ని ఫేక్ అకౌంట్లు, సూడో అభిమానులుగా వ్యవహరిస్తున్న విషయం మన దృష్టికి వచ్చింది. వీరు ఒక పార్టీకి అభిమానుల్లా నటిస్తూ, మరో మిత్రపక్ష నాయకులను తీవ్రంగా విమర్శించడం, వ్యక్తిగతంగా దూషించడం లేదా వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. ఉదాహరణకు, టీడీపీ అభిమానిలా కనిపించే ఒక ఫేక్ అకౌంట్ చంద్రబాబును పొగుడుతూనే పవన్ కళ్యాణ్‌ను విమర్శించవచ్చు. జనసేన అభిమానిలా కనిపించే ఫేక్ అకౌంట్ చంద్రబాబును విమర్శించొచ్చు. దీంతో అసలైన కార్యకర్తలు ఆవేశానికి లోనై మిత్రపక్షాలపై పరస్పరం దాడులకు దిగుతున్నారు. చివరకు మనలో మనమే గొడవపడుతూ, వైఎస్సార్సీపీకి రాజకీయంగా, ప్రయోజనం కల్పిస్తున్నాం' అన్నారు.'ఎన్టీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి వైఎస్సార్సీపీ వ్యూహాలను తిప్పికొట్టి, కూటమి ప్రభుత్వ అభివృద్ది, సంక్షేను కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో, మనలో మనమే విభేదాలు సృష్టించుకోవడం మిత్ర ధర్మానికి విరుద్దం. ఈ పరిస్థితికి ముగింపు పలికేందుకు మూడు మిత్రపక్షాల నాయకత్వం ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకుంది. ఇకపై టీదీపీ, జనసేన, బీజేపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా మిత్రపక్ష నాయకులపై, వారి కుటుంబసభ్యులపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు, పరస్పర కక్షపూరిత ప్రచారానికి పాల్పడితే, వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది' అని హెచ్చరించారు.'మా ప్రధాన ఉద్దేశ్యం సూడో వ్యక్తులను గుర్తించి, వారి కుట్రలను అడ్డుకోవడం. అందుకు ముందుగా అసలైన అభిమానులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి. అనుమానాస్పద పోస్టులు లేదా కామెంట్లు కనిపిస్తే వెంటనే స్పందించకుండా పార్టీల దృష్టికి తీసుకురావాలి. వాటిపై పార్టీలు తగిన చర్యలు తీసుకుంటాయి. ఇకపై మిత్రపక్షాలపై మితిమీరిన విమర్శలు, వ్యక్తిగత దాడులు, దూషణలకు ఎవరూ పాల్పడవద్దు. సంయమనం వహించి కూటమి ఐక్యత ను బలోపేతం చేయండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ప్రజలకు వాస్తవాలను స్పష్టంగా వివరించి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి' అని ప్రకటనలో సూచించారు.




