ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలనే నినాదాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళలు ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటోంది. దీని కోసం ఏపీ ప్రభుత్వం డీఆర్డీఏ-సెర్ప్ ఆయా రంగాల్లో అనుభవం ఉన్న సంస్థలతో రాష్ట్రస్థాయిలో ఓ అవగాహన ఒప్పందం చేసుకుంది. తాజాగా మహిళలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా చాయ్‌రాస్తా పేరుతో టీస్టాల్స్ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేలా అనంతపురం జిల్లాలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. సెర్ప్ చాయ్ రాస్తా బ్రాండ్‌తో టీస్టాల్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం చేసుకుంది.ఈ చాయ్ రాస్తా బ్రాండ్‌తో టీస్టాల్ ఏర్పాటుకు ఫ్రాంచైజ్ తీసుకుంటే కంటైనర్‌తో పాటుగా సామాగ్రి అందిస్తారు. టీ, కాఫీ కోసం పంచదార, పాలు.. బిస్కెట్లు, కూల్డ్రింకులు విక్రయించొచ్చు. అలాగే చాయ్ రాస్తా ఏర్పాటుకు సంబంధించి లొకేషన్ సర్వే, డాక్యుమెంటేషన్, లైసెన్సులు, మార్కెటింగ్, వ్యాపార శిక్షణలో ఎదురయ్యే సమస్యల పరిష్కరిస్తారు. ఈ చాయ్ రాస్తా ఏర్పాటు చేసుకునేందుకు డీఆర్డీఏ స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 4 లక్షల వరకు రుణం అందిస్తారు. PMEGP (ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం) కింద రూ. 4 లక్షల రుణం పొందితే రూ. 1.40 లక్షల రాయితీ పొందే అవకాశం కూడా కల్పించారు.ఆయా ప్రాంతాన్ని బట్టి.. ప్రతి రోజూ రూ. 5వేల వ్యాపారం జరిగితే నెలకు రూ. 40వేలు వరకు ఆదాయం వస్తుందనే అంచనా ఉంది. అదే రూ. 10వేలు వ్యాపారం జరిగితే నెలకు రూ. లక్ష వరకు.. రూ. 20వేలు వ్యాపారం జరిగితే నెలకు రూ. 2.50 లక్షల ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో మహిళలు చాయ్రాస్తాలు ఏర్పాటు చేసుకోవడానికి లైన్ క్లియర్ అయ్యింది. మొత్తం 30చోట్ల అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ చాయ్ రాస్తాలను ప్రధానంగా టోల్గేట్లు, నేషనల్ హైవేలు, రద్దీ ప్రదేశాల్లో పెట్టేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరికొన్నిచోట్ల చాయ్ రాస్తాలు ఏర్పాటు చేసేందుకు సర్వే ప్రక్రియ చేపట్టారు.



