
Vladimir Putin : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం అంతులేకుండా సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు ఇండియా, రష్యా ప్రతిపాదించాయి. రెండు దేశాల మధ్య శాంతి స్థాపనలో తాము సహకరిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిపాదించారు. ఈ నిర్ణయాన్ని రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ స్వాగతించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, పుతిన్, జిన్‌పింగ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తావనకు వచ్చింది.
దీంతో తాము శాంతికి సహకరిస్తామని మోదీ, జిన్‌పింగ్ సూచించారు. ఈ విషయాన్ని రష్యా వెల్లడించింది. రష్యా అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆదివారం వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రయత్నాలు ఏవీ సత్ఫలితాల్ని ఇవ్వలేదు. ఈ తరుణంలో మోదీ, జిన్‌పింగ్ ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది.
ఎందుకంటే రష్యాలో సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంట్ ఎన్నికలు ఇవి. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ యుద్ధం అంశం కీలకంగా మారుతుంది. అక్కడి ఎన్నికల్లో పుతిన్‌కు చెందిన ద యునైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో తాము శాంతి కోసం సహకరిస్తామని ఇండియా కూడా ఎప్పటినుంచో చెబుతోంది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే విషయానికి కట్టుబడి ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే ట్రంప్.. తన ప్రతినిధుల్ని శాంతి చర్చల కోసం పుతిన్ వద్దకు పంపించారు. కానీ, ఈ చర్చలు సఫలం కాలేదు. అయితే, మోదీ, జిన్‌పింగ్ జోక్యంతో శాంతి ప్రతిపాదన అంశం ముందుకు సాగుతుందేమో చూడాలి.





