
ఆనందపురం: అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో విశ్వ ఆయుర్వేద పరిషత్, వరము ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చరక జయంతి వేడుకల్లో భాగంగా సోమవారం రెండో రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మూడో రోజు శిబిరం జరగనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. దీనిలో ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ధన్వంతరి హవనం నిర్వహించారు. అనంతరం ఉచిత పంచకర్మ చికిత్సా శిబిరంలో భాగంగా 200 మందికి పైగా రోగులకు మాత్రా వస్తి రెండో డోస్ అందించారు. మరో 200 మందికి పైగా రోగులకు ప్రత్యేక ఆయుర్వేద చికిత్స నిర్వహించారు. కర్ణాటక ఆయుష్ శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ డా. ఎన్. ఆంజనేయమూర్తి వస్తి కర్మ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. చికిత్స అనంతరం పాటించాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, జీవనశైలి విధానాలను రోగులకు సూచించారు. ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా. సుందర్రాజ్ పెరుమాళ్ వెన్నెముక సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, క్షీణత సంబంధిత వ్యాధులు, కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు తీసుకోవాల్సిన ఆహార మార్పులపై అవగాహన కల్పించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





