
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana Govt Free Schemes: మహిళలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని నేడు ప్రారంభించనుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంలో భాగంగా మహిళల స్వయం ఉపాధి కోసం ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టనుంది. అయితే అందరూ మహిళలకు కాకుండా వెనుకబడిన వర్గాల (బీసీలు) మహిళలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. నేడు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేయనుండగా ఆ పథకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. నేడు ఆగస్టు 13 గురువారం సచివాలయంలో బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు మహిళలు ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుట్టు వృత్తిపై ఆసక్తి నైపుణ్యం ఉన్న పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ఈ పథకం ద్వారా అందిస్తున్నారు.
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ మహిళలను ఎంపిక చేసి వారికి ప్రతీ నియోజకవర్గంలో అందించనున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టు మిషన్లను అందిస్తుండడం విశేషం. కుట్టు వృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పించడంతోపాటు వారి ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.
మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని ఆర్జించే స్వయం ఉపాధి మహిళలుగా.. భవిష్యత్ మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తూ, మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేసే దిశగా ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కీలక ముందడుగుగా నిలవనుంది.
పథకం ప్రారంభం వివరాలు ఎప్పుడు: ఆగస్టు 13, 2026 గురువారం సయమం: మధ్యాహ్నం 12:00 గంటలకు ఎక్కడ: హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని జీ-29 అర్హులు: పథకం విధి విధానాలు, కేటాయించిన బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించనున్నారు.





