తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే విదేశీ భక్తులకు కేంద్రం తీపికబురు చెప్పింది. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఈ-వీసా ఎంట్రీ పాయింట్‌గా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. గతంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే విదేశీ భక్తులు ముందుగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లి అక్కడ ఈ-వీసీ ఎంట్రీ ప్రక్రియ పూర్తిచేసుకుని తిరుపతికి వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారు. ఇకపై హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లే పని లేకుండా తిరుపతి విమానాశ్రయంలోనే వీసా ఎంట్రీ పాయింట్ అందుబాటులోకి రానుంది. దీంతో విదేశీ ప్రయాణికులకు ఊరట దక్కింది.విదేశీ ప్రయాణికులు భారతదేశాన్ని సందర్శించడానికి ఈ-వీసా (e-Visa)ను ఆన్లైన్ ద్వారా పొందుతారు. వీసా కోసం ఇండియన్ ఎంబసీకి వెళ్లే అవసరం లేకుండా.. ఆన్లైన్లోనే వీసా కోసం దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించాలి. ఈ-వీసాలు 95 శాతం దరఖాస్తులు 72 గంటల్లోనే క్లియర్ చేస్తున్నారు. ఈ-వీసా పొందిన ప్రయాణికులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.. దానిని ప్రింట్ తీసుకుని ఇండియాకు రావొచ్చు.. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు పాస్‌పోర్ట్‌పై వీసా స్టాంప్ వేస్తారు. టూరిస్ట్ కాకుండా మొత్తం 17 వేర్వేరు సబ్-కేటగిరీల కోసం ఈ-వీసాలు పొందవచ్చు.ఈ-టూరిస్ట్ వీసాలు గరిష్టంగా 30 రోజులు ఉండవచ్చు.. దీనిని పొడిగించరు. అలాగే ఏడాది పాటూ జారీ చేసే వీసా మల్టిపుల్ ఎంట్రీలతో చెల్లుతుంది. మరో వీసా ఐదేళ్ల పాటు మల్టిపుల్ ఎంట్రీలతో చెల్లుతుంది. ఏడాది, ఐదేళ్ల వీసాల ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో గరిష్టంగా 180 రోజులు మాత్రమే ఇండియాలో ఉండేందుకు అనుమతి ఇస్తారు. ఈ-వీసా సదుపాయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది. అంతేకాదు ప్రయాణికుల పాస్‌పోర్ట్ కనీసం 6 నెలలు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి. ఇమ్మిగ్రేషన్ స్టాంప్ కోసం కనీసం రెండు ఖాళీ పేజీలు ఉండాలి. ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు.. ఫారమ్ నింపి, పాస్‌పోర్ట్ కాపీ, ఫోటోను అప్లోడ్ చేసి, ఆన్లైన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో లేవు.. కానీ ముందుగానే ఈ-వీసా ఎంట్రీ పాయింట్ మంజూరు చేశారు. తిరుపతికి త్వరలోనే ఇంటర్నేషనల్ సర్వీస్‌లు ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. 2024 డిసెంబర్లో సింగపూర్ నుంచి ఒక అంతర్జాతీయ చార్టర్డ్ విమానం తిరుపతిలో ల్యాండ్ అయ్యింది. అయితే అది పూర్తిగా కమర్షియల్ సర్వీస్ కాదు. తిరుపతి విమానాశ్రయం రన్ వేను కూడా 2,286 మీటర్ల నుంచి 3,819 మీటర్లకు పొడిగించారు. అలాగే మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపరిచారు. త్వరలోనే తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు వస్తాయని భావిస్తున్నారు. తిరుపతితో పాటుగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, పంజాబ్‌లోని అట్టారీ, రక్సాల్, రూపైడిహా, జోగ్బానీ, దర్రంగా, గెడే, ఘోజాదంగా, హరిదాస్పూర్, జైగావ్, డావ్కీ, మోరేలో ఈ-వీసా సదుపాయం అందుబాటులోకి రానుంది.





