
అమ్మ ఒడిలోని ఆహారం.. బిడ్డకు తొలి ఔషధం. అయితే ప్రతి శిశువుకూ పుట్టిన వెంటనే తల్లి పాలు అందే పరిస్థితి ఉండదు. ముందస్తు ప్రసవం, అనారోగ్యం లేదా ఇతర కారణాలతో తల్లి పాలు అందించలేని సందర్భాల్లో నవజాత శిశువులకు తల్లిపాలే అందేలా హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి. ఒక తల్లి తన బిడ్డ కోసం ఇచ్చిన పాలు.. మరో తల్లి బిడ్డకు జీవనాధారంగా మారుతున్నాయి.
పుట్టిన మొదటి 6 నెలల వరకు శిశువుకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యులు చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుషేనా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంకులు సేవలందిస్తున్నాయి.
గాంధీ, నిలోఫర్, ఈఎస్ఐ, మహబూబ్ నగర్, బిజాపూర్, కాకినాడ, భీమవరం, గోరఖ్ పూర్, నోయిడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశువులకు తల్లిపాలను అందిస్తున్నామని ధాత్రి మదర్ మిల్క్ బ్యాంకుల నిర్వాహకుడు కె సురేష్ కుమార్ చెప్పారు. గాంధీ ఆసుపత్రిలోని ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ తల్లిపాల వారోత్సవాల్లో మొదటి బహుమతి పొందింది.
తల్లులకు అండగా.. హైదరాబాద్ నగరంలోని మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంకులు, సమగ్ర చనుబాల నిర్వహణ కేంద్రాల్లో అంకితభావంతో పనిచేస్తున్న చనుబాల సలహాదారులు మాతృత్వంలోని ప్రతి ముఖ్యమైన దశలో తల్లులకు చెప్తూ తల్లిపాల ప్రాధాన్యం గురించి వివరిస్తున్నారు.
చనుబాలు త్వరగా పట్టడం, శిశువు మొదటిసారి పాలు అందుకునేలా చూడటంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా 90 లీటర్ల పాలను దానంగా అందించారని మమత చెప్పారు.
శిశువుల పోషణ.. తల్లులకూ ప్రయోజనం తల్లి పాల ఉత్పత్తి వల్ల గర్భాశయ సంకోచంతో ప్రసవం తర్వాత గర్భాశయం తిరిగి సాధారణ స్థితికి రావడానికి, రక్తస్రావం తగ్గడానికి పాలు ఇవ్వడం సాయపడుతుంది. పాలిచ్చే తల్లులలో రొమ్ము కేన్సర్, అండాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
గర్భధారణ సమయంలో పెరిగిన అదనపు బరువు, కొవ్వును సహజంగా కరిగించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. పాలు ఇచ్చే సమయంలో తల్లి, బిడ్డ మధ్య మానసిక అనుబంధం, ప్రేమ మరింత బలపడతాయి.
ఒక తల్లి మిగిల్చిన పాలు.. మరో బిడ్డకు కొత్త ఊపిరి. పుట్టిన వెంటనే తల్లి పాలు అందని నవజాత శిశువులకు మదర్‌ మిల్క్‌ బ్యాంకులు అండగా నిలుస్తూ.. మాతృత్వానికి మరో అర్థాన్ని చాటుతున్నాయి. తన బిడ్డకు అందించిన తర్వాత మిగిలిన పాలను దానం చేసే ప్రతి తల్లి.. తెలియని మరో బిడ్డ ఆరోగ్యానికి, భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. అందుకే మాతృ పాల దానం కేవలం పాలు ఇవ్వడం కాదు.. ఒక తల్లి నుంచి మరో బిడ్డకు అందించే జీవనామృతం.
తల్లి పాలు ఎవరికి అవసరం.. నెలలు నిండకుండా పుట్టిన శిశువులు, రెండు కిలోల కంటే తక్కువ బరువున్న శిశువులు, తల్లి లేని శిశువులు, తగిన పాలు లేని తల్లుల పిల్లలకు తల్లిపాలు దానం చేయడం ద్వారా నవజాత శిశువులను సంరక్షించేందుకు వీలుగా తమ పాలను ఎందరో తల్లులు దానంగా మదర్ మిల్క్ బ్యాంకులకు అందజేస్తున్నారు.
తల్లి పాలపై పెరిగిన చైతన్యంతో ఎందరో తల్లులు తమ బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను దానంగా మదర్ మిల్క్ బ్యాంకులకు అందించేందుకు ముందుకు వస్తున్నారని గాంధీ ఆసుపత్రిలోని ధాత్రి మదర్ మిల్క్ బ్యాంకు లాక్టేషన్ కౌన్సెలర్ ఎలగందుల మమత చెప్పారు.
9 నెలలు నిండకుండానే ప్రసవించిన తల్లులు, తక్కువ బరువుతో జన్మించిన నవజాత శిశువులకు దానంగా వచ్చిన పాలను ఇస్తున్నామని ఆమె తెలిపారు. కొందరు తల్లులు సరిగా తినకపోవడం, మానసికంగా ఆందోళన చెందడం వల్ల పిల్లలకు కావాల్సిన పాలు పడవని అన్నారామె. అలాంటి పిల్లలకు తాము మదర్ మిల్క్ బ్యాంకులోని పాలను అందిస్తున్నామని వివరించారు.
తల్లి పాల దానం తమ బిడ్డకు ఇవ్వగా మిగిలి ఉన్న పాలను ఇతర నవజాత శిశువులకు అందించాలనే లక్ష్యంతో వాటిని నిర్ణీత ప్యాకెట్లలో నింపి ధాత్రి మదర్ మిల్క్ బ్యాంకుకు దానంగా అందిస్తున్నారు. తల్లులు తమ పాలను డీ ఫ్రీజర్లో నిల్వ చేసి, ఆపై వాటిని ఐస్ బాక్సులో ఉంచి మదర్ మిల్క్ బ్యాంక్కు అందిస్తారు. ఆ పాలను పాశ్చరైజ్‌ చేసి లామినార్ మిషన్లో యూవీ స్టెరిలైజేషన్ చేస్తారు.
ఆ తర్వాత పాలను పూలింగ్ చేసి కల్చర్ టెస్ట్ చేస్తారు. హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, సీ కల్చర్ టెస్టులు చేసి నెగిటివ్ అని రిపోర్టు వస్తే వాటిని వైద్యుల పర్యవేక్షణలో నవజాత శిశువులకు పాలు తాగిస్తారు. మదర్ మిల్క్ బ్యాంకులు శానిటైజ్ చేయడంతో పాటు డీ ఫ్రీజర్లో నిల్వ చేసి పాలను అవసరమైన శిశువులకు అందిస్తుంటారు.
మదర్ మిల్క్ బ్యాంకులు హైదరాబాద్లోని గాంధీ, నీలోఫర్, ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ధాత్రి మదర్ మిల్క్ బ్యాంకులు వెలిశాయి. ఈ మదర్ మిల్క్ బ్యాంకుల్లో పిల్లలకు పాలు ఇచ్చేందుకు వీలుగా మదర్ లాంజ్లు, డీ ఫ్రీజర్లను ఏర్పాటుచేశారు.
ఆసుపత్రుల్లో ప్రసవించిన తర్వాత నవజాత శిశువులకు తల్లి పాలు లభించకుంటే దాతలు ఇచ్చిన పాలను పాశ్చరైజ్ చేసి వాటిని అందిస్తున్నారు. తల్లుల్లో చైతన్యం రావడంతో ఏడాది కాలంలోనే 45 లక్షల మిల్లీలీటర్ల తల్లి పాలను ధాత్రి మదర్ మిల్క్ బ్యాంకులకు దానంగా అందించారని ధాత్రి మదర్ మిల్క్ బ్యాంకు ప్రతినిధి కె. సురేష్ కుమార్ చెప్పారు.





