భారతదేశంలో పండ్లు, కూరగాయలలో పురుగుమందుల అవశేషాలపై నిర్వహించిన జాతీయస్థాయి పరిశోధనల్లో ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. ఎక్కువ పురుగుమందు అవశేషాలు ఉన్న జాబితాలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలిచింది. 2023 నుంచి 2026 మధ్యకాలంలో సేకరించిన నమూనాలను పరిశీలించగా.. అనుమతించిన గరిష్ఠ పరిమితి కంటే ఎక్కువగా పురుగుమందుల అవశేషాలునమోదైన కేసుల్లో తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు సమర్పించిన అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన 8,198 నమూనాల్లో 486 నమూనాల్లో అంటే సుమారు 5.9 శాతం రసాయనాలు నిర్దేశిత పరిమితులను మించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎట్ నేషనల్ లెవెల్ (MPRNL) ప్రాజెక్టు కింద ఈ పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా పరీక్షించిన 70,652 నమూనాల్లో 3.1 శాతం మాత్రమే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిమితిని మించగా.. తెలంగాణ సగటు ఏకంగా 5.9 శాతంగా నమోదు కావడం ఆహార భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ జాబితాలో కర్ణాటక 3.6 శాతంతో రెండో స్థానంలో నిలవగా.. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో మోతాదు మించిన అవశేషాలు ఏవీ నమోదు కాకపోవడం గమనార్హం.తెలంగాణలో వ్యవసాయంలో క్రిమిసంహారకాల వినియోగం విపరీతంగా ఉండటమే ఈ తీవ్రమైన పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఐసీఏఆర్ నివేదిక ప్రకారం.. తెలంగాణలో హెక్టారుకు సగటున 0.530 కిలోల టెక్నికల్ గ్రేడ్ పురుగుమందులు వాడుతున్నారు. ఇది జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు. క్లోర్‌పైరిఫాస్, డైమెథోయేట్, కార్బోఫ్యూరాన్ మరియు 2,4-D వంటి ప్రమాదకర రసాయనాలను నిబంధనలకు విరుద్ధంగా పంటలపై ఎక్కువగా పిచికారీ చేస్తున్నారు.ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వైద్య రంగానికి చెందిన నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాధాల వెల్లడించిన వివరాల ప్రకారం.. వీటి బారిన పడటం వల్ల నాడీ సంబంధిత సమస్యలు, కాలేయం, మూత్రపిండాల రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే దీర్ఘకాలికంగా రసాయనిక అవశేషాలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, హార్మోన్ల అసమతుల్యత, కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని అన్నారు. పండ్లు, కూరగాయలను ఫ్లోయింగ్ నీటిలో కడగడం, తొక్క తీయడం ద్వారా ఉపరితల రసాయనాలను కొంతవరకు తగ్గించవచ్చునని అంటున్నారు. అయితే పంటలు పండించే సమయంలోనే విచక్షణారహిత క్రిమిసంహారకాలు వాడకుండా చెక్ పెట్టడమే దీనికి శాశ్వత పరిష్కారమని అంటున్నారు.





