తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టికెట్ల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దంటూ పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసినా.. భక్తులు మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నారు. తాజాగా శ్రీవారి సేవా టికెట్లు, టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ సస్పెండ్ అయిన టీటీడీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. టికెట్లు, ఉద్యోగాల పేరుతో మొత్తం రూ. 10 లక్షల మేర మోసం చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.తిరుమల టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోలా స్ట్రీట్‌కు చెందిన జలకర గిరిధర్ టీటీడీలో సబార్డినేట్ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షనల్లో ఉన్నాడు. టీటీడీలో తాను పేష్కార్గా పనిచేస్తున్నానని చెప్పి శ్రీవారి సేవా టికెట్లు ఇప్పించగలనని భక్తులను నమ్మించేవాడు. భక్తులకు నమ్మకం కలిగించేందుకు టీటీడీ గుర్తింపు కార్డును కూడా పంపేవాడు. ఈ క్రమంలోనే ఈతముక్కల సుబ్రహ్మణ్యం నాయుడు అనే భక్తుడిని నమ్మించి, ఫోన్ పే నెంబర్‌కు పలు విడతల్లో రూ. 1,56,000 నగదు బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు.READ ALSO ఇలాంటి ద్రౌపదీ దేవి ఆలయం గురించి ఎక్కడా వినుండరు.. దక్షిణ భారతంలోనే ఏకైక గుడి, తెలుసుకోండి!దాంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సుబ్రహ్మణ్యం నాయడు పోలీసులను ఆశ్రయించాడు. విచారణలో శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి భక్తుల నుంచి నగదు తీసుకోవడంతో పాటు, తిరుపతికి చెందిన మరో వ్యక్తికి టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3,60,000 తీసుకుని మోసం చేసినట్లు కూడా నిందితుడు వెల్లడించాడు. దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, నిందితుడు వివిధ సందర్భాల్లో మొత్తం సుమారు రూ.10,00,000 మేర మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసాలకు సంబంధించి నమోదైన కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది.నిందితుడు జలకర గిరిధర్‌ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 15 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు దళారులు, నకిలీ వ్యక్తుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరికైనా డబ్బులు చెల్లించే ముందు వారి వివరాలను పూర్తిగా నిర్ధారించుకోవాలని తెలిపారు.




