
Death Penalty| ఇంటర్నెట్‌డెస్క్: మరణశిక్ష అమలులో ఉరితీయడానికి బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ వాడాలని చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు (Supreme Court) తోసిపుచ్చింది. మరణశిక్షను అమలు చేసే పద్ధతిగా ప్రస్తుతానికి ఉరితీయడమే కొనసాగుతుందని తాజాగా స్పష్టం చేసింది. దోషికి తక్కువ నొప్పి కలిగించే, వారి గౌరవాన్ని కాపాడే విధంగా ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిని తాజాగా ధర్మాసనం కొట్టివేసింది. అలాగే ఇదే అంశంపై గతంలో ఇచ్చిన తీర్పులను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.
ఈ పిటిషన్‌ను న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో వేశారు. ప్రాణాంతక ఇంజెక్షన్, షూటింగ్, ఎలక్ట్రిక్ షాక్, గ్యాస్ చాంబర్ వంటి పద్ధతుల్లో దోషి కొన్ని నిమిషాల్లో చనిపోతాడని పేర్కొన్నారు. ఉరితీయడం అత్యంత బాధాకరమైన ప్రక్రియ అని, క్రూరమైదని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన మరణం పొందే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని కోరారు. ఉరి తీసిన తర్వాత ఆ వ్యక్తి మరణించాడని ప్రకటించడానికి 40 నిమిషాలు పడుతుందని, అదే ఇంజెక్షన్ (Lethal injection) ద్వారా అయితే ఆ సమయం ఐదు నిమిషాల్లో పూర్తవుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ బాధ కలిగే రీతిలో మరణశిక్షను అమలు చేయాలని ఐరాస తీర్మానం చెబుతోందని గుర్తుచేశారు.
ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు (Supreme Court).. తమ తీర్పే అంతిమమైంది కాదని తెలిపింది. మరణశిక్ష అమలుకు ప్రత్యామ్నాయ పద్ధతులపై మెరుగైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నట్లయితే.. భవిష్యత్‌లో ఈ అంశాన్ని పరిశీలించవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికి కేంద్రం ఉరిశిక్షను కొనసాగించడానికే సుముఖత వ్యక్తం చేసింది. ఉరిశిక్ష లేక ఇంజెక్షన్‌ను ఎంచుకునే అవకాశాన్ని దోషికి ఇవ్వాలని కోర్టు సూచించగా.. అలా చేయడం వల్ల ప్రయోజనం ఉండదని గత విచారణల్లో కేంద్రం వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ప్రముఖ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ ముంబయిలోని సిద్ధివినాయకుడిని దర్శించుకున్నారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఎస్డీఆర్ఎఫ్ బృందం ప్రాణాలకు తెగించి కాపాడింది.



