
దిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి ఎస్ఎల్పీ వేశారు. దీనిపై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేతో కూడిన ధర్మాసనం ఎదుట తుది విచారణ జరిగింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, నాగముత్తు వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు రూ.2,500 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్లు మార్గదర్శి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. క్లెయిమ్ చేయని రూ.5.23 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, ఎస్క్రో అకౌంట్లో జమ చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు.. తెలంగాణ హైకోర్టు వ్యవహరించిందన్నారు. సుప్రీం ఆదేశం మేరకు పబ్లిక్ నోటీసు ఇచ్చి తదుపరి ప్రక్రియ నిర్వహించారని తెలిపారు.
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మార్గదర్శి వ్యవహారంపై పిటిషన్ వేయడానికి, పోరాటం చేయడానికి మీరెవరని ఉండవల్లిని ప్రశ్నించింది. ఈ కేసు వివరాలన్నీ పరిశీలిస్తే... ఇది మీ వ్యక్తిగత వివాదంగా కనిపిస్తోంది తప్ప ఎలాంటి అంశాలు కనిపించడం లేదని జస్టిస్ ఎంఎం సుందరేశ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో మీరు వాదించే కొద్దీ మీపైనే అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. ఇరువైపుల వాదనల అనంతరం.. ఉండవల్లి పిటిషన్ను కొట్టివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





