
కొందరు చిన్న చిన్న శబ్దాలకే చిరాకుపడుతుంటారు. కోపంతో అక్కడ్నుంచి వెళ్లిపోతుంటారు. ఇలా చేయడం కూడా ఓ రకమైన రుగ్మతే. దీన్నే ‘మిసోఫోనియా’ అని పిలుస్తారు. ఈ సమస్య సాధారణంగా బాల్యం లేదా కౌమార దశలో ప్రారంభమవుతుంది.
మిసోఫోనియా ఓ ప్రత్యేకమైన మానసిక, నరాల సంబంధిత రుగ్మత. ఇది గ్రీకు పదం. మిసోస్ అంటే ‘ద్వేషం’, ఫోనోస్ అంటే ‘ధ్వని’ అని అర్థం. దీన్ని సాధారణంగా శబ్దాల పట్ల విపరీతమైన ద్వేషం అని పిలుస్తారు. ఇది ఉన్నవారికి కొన్ని రోజువారీ శబ్దాలు కూడా కోపం, ఆందోళన, అసహ్యం లేదా పారిపోవాలనే భావనను కలిగిస్తాయి. ఇది వినికిడి సమస్య కాదు. ఆ శబ్దాలను మెదడు విశ్లేషించే విధానంలో తేడా వల్ల ఇలా జరుగుతుంది.
ఆహారాన్ని శబ్దం చేస్తూ నమలడం, చప్పరించడం, గుటకలు వేయడం, గాలి పీల్చడం, గురక, ముక్కు చీదడం, ఆవలింతలు, ఊపిరి పీల్చడం, పెన్సిల్ కొట్టడం, పెన్ క్లిక్ చేయడం, కీబోర్డ్ టైపింగ్, టేబుల్‌పైన వేళ్లతో డ్రమ్ చేయడం, గొంతు సవరించుకోవడం, గడియారం టిక్-టిక్ శబ్దం, చెంచాలు, ప్లేట్ల శబ్దం, అడుగుల శబ్దాలు. కుక్కలు మొరగడం, పిల్లులు నాకడం, పక్షుల అరుపులు వంటివీ వీరికి చిరాకు తెప్పిస్తాయి.
మిసోఫోనియాకు ఖచ్చితమైన కారణాల్లేవు. మెదడులోని ఇన్సులా ప్రాంతం అధికంగా క్రియాశీలం కావడం వల్ల ఏర్పడొచ్చని వైద్యులు చెబుతున్నారు. మెదడులోని యాంటీరియర్ ఇన్సులర్ కార్టెక్స్(ఏఐసీ) అనే భాగం భావోద్వేగాలను, ఇంద్రియ జ్ఞానాన్ని నియంత్రిస్తుంది. మిసోఫోనియా బాధితుల్లో ఈ భాగం ట్రిగ్గర్ శబ్దాలు విన్నప్పుడు అతిగా స్పందిస్తుంది. దీనివల్ల మెదడు ఆ సాధారణ శబ్దాలను ఓ ప్రమాదకరమైన సంకేతంగా భావించి, రక్షణ చర్యగా కోపాన్ని లేదా భయాన్ని ప్రేరేపిస్తుంది.
మిసోఫోనియాను నిర్ధారించడానికి ప్రస్తుతం ఏ పరీక్ష లేదు. కానీ, రోగి లక్షణాలు, శబ్దాలకు సంబంధించిన ప్రతిచర్యల ద్వారా తెలుసుకోవచ్చని పరిశోధనల్లో తేలింది. ఆడియలాజికల్ మూల్యాంకనం కూడా అవసరం. మిసోఫోనియా యాక్టివేషన్ స్కేల్(ఎంఏఎస్-1) ద్వారా వ్యక్తి స్వయంగా నివేదించే లక్షణాల తీవ్రతను గుర్తించొచ్చని వైద్యులు చెబుతున్నారు.
సాధారణ ట్రిగ్గర్స్ (ప్రేరేపించే శబ్దాలు): మిసోఫోనియా ఉన్న వారిలో తీవ్ర స్పందనలను కలిగించే శబ్దాలను సాధారణ ట్రిగ్గర్స్ అంటారు.
విజువల్ ట్రిగ్గర్స్(మిసోకినేసియా): శబ్దంతో పాటు కొందరు కాళ్ళు ఊపడం, జుట్టుతో ఆడుకోవడం లేదా నమలడాన్ని, చూడటాన్ని కూడా భరించలేరు. ఇవి విజువల్ ట్రిగ్గర్స్.
లక్షణాలు-స్పందనలు.. ట్రిగ్గర్ శబ్దాలు వినపడగానే కోపం, అసహ్యం, చిరాకు లేదా ఆగ్రహం, ఆందోళన, భయం కలుగుతుంది. అక్కడ్నుంచి వెళ్లాలనే బలమైన కోరిక పుడుతుంది. మానసిక స్పందనలు, గుండె వేగం పెరగడం, కండరాలు బిగుసుకుపోవడం, చెమటలు పట్టడం లేదా రక్తపోటు పెరగడం లాంటి లక్షణాలుంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగొచ్చు. ప్రతిస్పందనలు వారి నియంత్రణలో ఉండవు. ప్రవర్తన, భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందులు, జీవన విధానం, ఆరోగ్య సమస్యలు లాంటి వాటికి దారితీయొచ్చు.
ప్రస్తుతానికి ఈ వ్యాధికి మందుల్లేవు. నిపుణుల కౌన్సెలింగ్, థెరపీ ద్వారా నియంత్రించొచ్చు. యాంటీడిప్రెసెంట్, యాంజియోలిటిక్ మందులను వినియోగిస్తారని వైద్యులు చెబుతున్నారు.
కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ(సీబీటీ): దీని ద్వారా రోగులకు ఆ శబ్దాలపై తమకున్న ప్రతికూల ఆలోచనలను మార్చుకునేలా శిక్షణ ఇస్తారు.
టిన్నిటస్ రీట్రైనింగ్ థెరపీ(టీఆర్టీ): రోజంతా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉపయోగించడం, ప్రశాంతమైన శబ్దాల ద్వారా ట్రిగ్గర్ శబ్దాల తీవ్రతను తగ్గించొచ్చు.
జీవనశైలి మార్పులు: ధ్యానం, యోగా, తగినంత నిద్ర, క్రమంగా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, శబ్దాలపై సహనం పెరుగుతుంది.
సహాయక సాధనాలు: ఇయర్ ప్లగ్స్ లేదా నాయిస్-క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ వాడటం ద్వారా అత్యవసర సమయాల్లో శబ్దాల నుంచి రక్షణ పొందొచ్చు.
మిసోఫోనియాతో సంబంధమున్న మానసిక రుగ్మతల్లో ఓసీడీ(అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఒకటి. మిసోఫోనియా ఉన్నవారిలో సుమారు సగం మందికి ఓసీడీ లక్షణాలుంటాయి. అందువల్ల దీన్ని అంతగా గుర్తించని వ్యాధిగా పరిగణిస్తారు. క్లినికల్ నివేదికల ప్రకారం చూస్తే సాధారణ జనాభాలో సుమారు 20 శాతం మందికి ఇది ఉండొచ్చని, 6 శాతం మందిలో గణనీయమైన క్రియాత్మక బలహీనత కనిపిస్తుందని అంచనా. మిసోఫోనియాలో సుమారు 58 శాతం కేసుల్లో లక్షణాలు తీవ్రం అవుతాయి. సుమారు 25 శాతం కేసుల్లో లక్షణాలు స్థిరంగా ఉంటాయి.
డాక్టర్ జి.ఎవాంజిలిన్ బ్లెస్సీ, న్యూరాలజీలో అసోసియేట్ ఫ్రొఫెసర్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



