
stock market| ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రాణించాయి. దీంతో వరుసగా ఏడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. గురువారం సెషన్లో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా బాండ్ల రాబడులు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. విదేశీ మదుపర్ల పెట్టుబడులు కలిసొచ్చాయి. రియాల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి.
సెన్సెక్స్ ఉదయం 77,468.45 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,909.68) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా సూచీ లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 77,611.11 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 628.04 పాయింట్ల లాభంతో 77,537.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 153.55 పాయింట్లు పెరిగి 24,231.85 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.71గా ఉంది.
సెన్సెక్స్ 30లో టైటాన్, హెచ్‌సీఎల్, ఇండిగో, టాటా స్టీల్ కంపెనీ షేర్లు తప్ప మిగతా కంపెనీల షేర్లన్నీ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ధర 93.94డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4,490.60 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్ సూచీలు కూడా లాభాల్లోనే ట్రేడయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


