ప్రకాశం జిల్లాలో పోలీసుల కారులో గంజాయి అంటూ జరుగుతున్న ప్రచారంపై ఎస్పీ ఎస్పీ హర్షవర్ధన్‌రాజు క్లారిటీ ఇచ్చారు. అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని శంఖవరప్పాడు దగ్గర ఆదివారం పోలీసులు ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఆటోలోని వ్యక్తులు గాయపడిన మాట నిజమేనని.. కానీ పోలీసులు గంజాయి తరలిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆదివారం (ఆగస్టు 16న) సాయంత్రం 5.15 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందని.. బల్లికురవ వైపు నుంచి అద్దంకి వైపు వస్తున్న AP 27 CB 4789 కారు, ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయే క్రమంలో దాని వెనుక వస్తున్న AP 27 TB 1656 నంబరు ఆటోను ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయన్నారు.ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు స్పందించారన్నారు. వెంటనే 108కు సమాచారం అందించి అంబులెన్స్ వచ్చే వరకు ఎస్సైలు సంఘటనా స్థలంలోనే ఉండి, గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారన్నారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారి పరిస్థితిని కూడా పరిశీలించారని.. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఎస్సైలు మద్యం మత్తులో ఉన్నారని, ప్రమాదం జరిగిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారని, సిగరెట్లు తాగుతూ ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించారని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. సంఘటనా స్థలంలో పోలీసు సిబ్బంది ఉన్నారని.. ఎస్సైలు అక్కడే కొంతసేపు ఉండి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో సహకరించారన్నారు. ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించడం, గొడవకు దిగడం వంటి ఘటనలు జరగలేదన్నారు.గంజాయి, మద్యం సీసాలను ప్రైవేట్ వాహనంలో స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ. అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు తదితర నేరాలను అరికట్టడంతో పాటు నేరస్తులను గుర్తించి పట్టుకునే క్రమంలో కొన్ని సందర్భాల్లో పోలీసు సిబ్బంది ప్రైవేట్ వాహనాలను కూడా ఉపయోగించాల్సి వస్తుందన్నారు.డ్యూటీలో ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు సిబ్బందిపై ఉందన్నారు. అయితే అనుకోకుండా బైక్‌ను తప్పించబోయే క్రమంలో ఆటోను ఢీకొన్న ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేయడం వల్ల పోలీసు శాఖ ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించాలని సూచించారు. అద్దంకి ప్రమాద ఘటనపై సమర్థవంతంగా దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు.ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా ఈ అంశంపై స్పందించింది. పోలీసుల కారులో గంజాయి దొరికిందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేస్తున్న సమయంలో పట్టుబడిన గంజాయిని పోలీసులకే ఆపాదించి తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. సంబంధిత వీడియోలను పోస్టు చేస్తున్న వారిపైనా, షేర్ చేస్తున్న వారిపైనా, విశ్లేషణ పేరుతో వాస్తవాలు వక్రీకరిస్తున్న వారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధ్యతతో విధినిర్వహణలో పాల్గొంటున్న పోలీసుల నైతిక ప్రవర్తనపై ప్రజలకు అనుమానం వచ్చే విధంగా తప్పుడు ప్రచారానికి పాల్పడటం సరికాదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.





